ఏర్పేడులో జగన్ ఓదార్పు

చిత్తురు జిల్లా ఏర్పేడు లారీ ప్రమాద మృతుల కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. మునగాల పాలెంలో పర్యటించిన జగన్ బాధిత కుటుంబాలను ఏదార్చారు. వారికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదన్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏర్పేడు ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. లారీ ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఇసుక మాఫియా ఈ ప్రమాదానికి కారణం కావచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా యద్దేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని జగన్ దుయ్యబట్టారు. తెలుగుదేశం నాయకులే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా ప్రముఖ టీడీపీ నేతలందరికీ ఇందులో వాటాలున్నాయని జగన్ ఆరోపించారు. ఇసుక మాఫియా పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని పొట్టన పెట్టుకున్నారని జగన్ మండిపడ్డారు.

స్వల్ప ఉధ్రిక్తత:

జగన్ పర్యటన సందర్భంగా గ్రామంలో స్వల్ప ఉధ్రిక్తత నెలకొంది. జగన్ తో పాటుగా పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు వచ్చారు. అందులో కొందరు జై జగన్ అంటూ నినాదాలు చేయడం ఉధ్రిక్తత కు దారితీసింది. చనిపోయిన వారి కుటుంబాల పరామర్శకు వచ్చినపుడు నినాదాలు చేయడంపై  గ్రామస్థులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వెంటనే స్పందించిన వైసీపీ నేతలు కార్యకర్తలకు సర్థిచెప్పి గ్రామస్థులకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సమసిపోయింది.