తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న 5రూపాయల భోజనాన్ని ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రుచిచూశారు. ఐదు రూపాయలకే పేదల కడపునించే భోజన కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడున్నవి కాకుండా మరికొన్ని సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా బేగంపేటలో అన్నపూర్ణ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అనంతరం మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి రోడ్డు మీదనే భోజనం చేశారు. ఆహారం నాణ్యత బాగుందని ఇదే తరహా నాణ్యతను కొనసాగించాలని కేటీఆర్ నిర్వాహకులను కోరారు. ఐదు రూపాయల భోజన పథకాన్ని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు మంత్రి చెప్పారు.
ఐదు రూపాయల భోజన పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. పెద్ద సంఖ్యలో ఐదు రూపాయల భోజన కేంద్రాలకు తరలివస్తున్నారు. ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఐదు రూపాయలకు మంచి భోజనం పెడుతుండడంతో అడ్డాకూలీలు,అటో డ్రైవర్లు ఎక్కువగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. పేద ప్రజలకు తక్కువ ధరకే పట్టెడన్నం దొరుకుతుండడంతో భోజన కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. దీనితో మరికొన్ని ప్రాంతాల్లో సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.