బాబ్రీ మసీదును కూల్చిన ఘటనలో బీజేపీ అగ్రనేత ఎల్.కె.అధ్వానీకి ఏమాత్రం సంబంధం లేదని, తానే కరసేవకులతో కలిసి కూల్చివేశానని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి మరోసారి చెప్పారు. లక్షలాది మంది కరసేవకులతో కలిసి తానే ఆ కట్టడాన్ని కూల్చేశానని అన్నారు. అయితే దాన్ని మసీదుగా మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు. దాన్ని వివాదాస్పద కట్టడంగానే తాను భావిస్తున్నాని ఆ కట్టడం మసీదు అంటే ఒప్పుకోనని అన్నారు. మసీదును కూల్చిసింది తానేనని దీనికోసం తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రామాలయం కోసం అవసరం అయితే ఉరికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
బాబ్రీమసీదును కూల్చే విషయంలో కుట్రలేం జరగలేదని ఆయన తేల్చిచెప్పారు. పెద్ద సంఖ్యలో గుమిగూడన కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూకారని వారికి తనలాంటి వారు దానికి నేతృత్వం వహించారని చెప్పుకొచ్చారు. వివాదాస్పద కట్టడాన్ని కూల్చే విషయంలో ముందుగా ఎటువంటి ప్రణాళికలు గానీ, కుట్రలు గానీ జరగలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో అధ్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి నేతలను అనవసరంగా ఇరికిస్తున్నారని వారికి ఈ ఘటనతో ఎటువంటి సంబంధంలేదని రామ్ విలాస్ వేదాంతి చెప్పారు. రామలయాన్ని వెంటనే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.