ఆగం కాలే…ఆదర్శంగా నిల్చాం…:కేసీఆర్

భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ కొంపల్లిలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. తనను మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న  కార్యకర్తలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2001లో కొంతమందితో టీఆర్ఎస్ ఏర్పడిందని ఇప్పుడని 75 లక్షల మంది సభ్యులతో దేశంలోని ప్రముఖ పార్టీల్లో ఒకటిగా నిల్చిందన్నారు. పార్టీని ఈ స్థాయికి తీసుకుని రావడంలో కార్యకర్తలు కృషి మరువలేనిదన్నారు. దగా పడ్డ తెలంగాణ ప్రజలకు అండగా ఉండేదుకు టీఆర్ఎస్ పుట్టిందని  ఆసమయంలో కొంత మంది నోటికొచ్చినట్టు మాట్లాడారని ఈ పార్టీ ఎక్కువ రోజులు నిల్చేదికాదంటూ ఎద్దేవా చేశారని ఆయన గుర్తుచేశారు. నవ్విన వాళ్ల మూతి పగలగొట్టేలా పార్టీకి అండగా కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు నిల్చారని తెలంగాణను పోరాడి సాధించుకున్నామని అన్నారు.

సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రాంతం ఈ విధంగా ఉండేదో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని కేసీఆర్ అన్నారు. పంటకాలువలను పూర్తిగా నాశనం చేశారని, గుర్రపు డెక్కలతో కాలువలు, చెరువులు నిండిపోయి ఉండేవని, కరవుతో తెలంగాణ రైతులు అల్లాడుతున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని చెప్పారు. నాడు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలతో తెలంగాణ ప్రాంతం భయంకరంగా ఉండిన సంగతిని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యోగులపై అణచివేతతో అన్ని రకాలుగా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు.

టీఆర్ఎస్ నేతృత్వంలో ఎగిసిన తెలంగాణ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇచ్చిన బిక్షకాదని ఇది తెలంగాణ ప్రజల పోరాట ఫలితమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని రకాలుగా రాష్ట్రం ఆగం అవుతుందని కరెంటు కష్టాలు వస్తాయని, ఇంకా ఎదో అయిపోతుందని భయపెట్టే ప్రయత్నాలు చేశారని మరి వారు ఇప్పుడు ఏమంటారని కేసీఆర్ ప్రశ్నించారు. కరెంటు సమస్యను కనపడకుండా చేశామని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం వంటి పథకాలతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని పోతున్నామన్నారు. కోటి ఎకరాలు సాగునిటిని అందిచడాన్ని తెలంగాణ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని చెప్పారు. జాతీయ రహదారులను అభివృద్ది చేశామన్నారు. ప్రతీ ఇంటికి తాగు నీటిని అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని ఓర్చుకోలేక సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలను అభివృద్ది చేస్తున్నామని కులవృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెడుతున్నామన్నారు.

రాష్ట్రంలో రైతులను పూర్తిగా ఆదుకుంటామని దానికోసం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. రైతులు, కుల వృత్తిదారుల కళకళలాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శంగా  నిలుస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.