కన్నడిగులకు కట్టప్ప క్షమాపణలు

ప్రముఖ సినీనటుడు, బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. కావేరి జల వివాద సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో బాహుబలి చిత్ర విడుదలను అడ్డుకుంటామంటూ కన్నడ సంఘాలు హెచ్చరికలు చేసిన నేపధ్యంలో సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. తాను కర్ణాటక రాష్ట్రానికి అక్కడి ప్రజలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తున్నానని సత్యరాజ్ అన్నారు. తాను కన్నడిగులకు క్షమాపణలు చెప్పినప్పటికీ తమిళ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. అన్ని విషయాల్లో తమిళ ప్రజల వెంటే ఉంటానని దీనికోసం  ఏ త్యాగానికైనా సిద్ధమేనన్నారు. తమిళ ప్రజల కోసం సినిమాల్లో వేషాలు వదలుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.
మరో వైపు సత్యరాజ్ వ్యాఖ్యలకు తమ సినిమాకు ఎటువంటి సంబంధంలేదని బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. సత్యరాజ్ వ్యాఖ్యలపేరుతో బాహుబలి విడుదలను అడ్డుకుంటామంటూ ప్రకటించడం సమంజసం కాదని రాజమౌళి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. తమ చిత్రవిడుదలకు సహకరించాలని ఆయన అర్థించారు.  సత్యరాజ్ తరపున తాను క్షమాపణ చెప్పిన రాజమౌళి చిత్ర విడుదలకు సహకరించాలని కన్నడ సంఘాలను కోరారు.
తాగాగా సత్యరాజ్ క్షమాపణలు చెప్పడంపై కన్నడ సంఘాలు ఇంకా  స్పందించలేదు. బాహుబలి -2 ఎప్రిల్ 28న విడుదలకు సిద్ధమయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *