రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ కొరడా

హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై  పై జీహెచ్ఎంసీ అధికారులు జరుపుతున్న దాడులు హోటళ్ల యాజమాన్యాలను కలవరపెడుతున్నాయి.  హోటళ్లలో ఆహార పదార్ధాలను సరైన రీతిలో వండడంలేదని, శుభ్రత పాటించడంలేదంటూ పలు ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం అధికారులు పలు రెస్టారెంట్లు,  హోటళ్లలలో తనిఖీలు నిర్వహిస్తూ ప్రమాణాలు పాటించని వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. నగరంలో పేరుమోసిన హోటళ్లతో పాటుగా పలు చోట్ల జీహెచ్ఎంసీ తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిన కొన్ని రెస్టారెంట్లు,  హోటళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు ఏకంగా తాళాలు వేశారు. దీనితో నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్ల యజమాన్యాల్లో కలవరం మొదలైంది. తనిఖీల పేరుతో దాడులు నిర్వహిస్తుంటే వ్యాపారం గణనీయంగా తగ్గిపోతోందంటూ హోటళ్ల యాజమాన్యాలు గగ్గొలు పెడుతున్నాయి. తినిఖీలు తగ్గించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులపై అన్ని రకాలుగా తీవ్ర ఒత్తిడి తీసుకుని వస్తున్నట్టు సమాచారం.
నగరంలోని చాలా రెస్టారెంట్లలో కనీస ప్రమాణాలు పాటించకుండా కిచెన్ లు నిర్వహిస్తున్న వైనం జీహెచ్ఎంసీ తనిఖీల్లో బయటపడింది. ముఖ్యంగా మాంసం విషయంలో నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న వారిపై  జీహెచ్ఎంసీ దాడులు ముమ్మరం చేయడంతో కొన్ని చోట్ల, మెనులో నుండి మటన్ విక్రయాలు మాయమయ్యాయి.  గుర్తింపు పొందిన వధశాలల నుండే మాంసాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇతర ప్రాంతాల నుండి మాంసాన్ని తెస్తున్నట్టు తనిఖీల్లో బయటపడింది. దీనితో పాటుగా మాంసాన్ని నిల్వచేసే  పద్దతి కూడా సరిగా లేకపోవడంతో  జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీ దాడులు వాటికి మీడియాలో భారీ ప్రచారం వస్తుండడంతో నగరంలో దాదాపు 30శాతం వ్యాపారం పడిపోయిందని రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలు అంటున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేసే పద్దతికూడా చాలా పురాతమైనదని ఆధునిక పద్దతుల్లో పరీక్షలు నిర్వహించాలని వారంటున్నారు. అనుమతి పొందిన కబేళాల సంఖ్య తక్కువగా ఉన్నందున నగరంలో అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాంసాన్ని కొనుగోలు చేస్తున్నామని వారు చెప్తున్నారు.
అధికారులు చేస్తున్న తనిఖీల విషయంలో ఇప్పటికే పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో వారు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. జీహెచ్ఎంసీ దాడుల కారణంగా వినియోగదారుల సంఖ్య పడిపోయిందని  వారంటున్నారు. అయితే నిబంధనలు సక్రంగా పాటించేవారికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవని పాటించని వారిపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశం కనుక తాము కఠినంగా ఉంటామంటున్న జీహెచ్ఎంసీ ఇదే దుకుడును కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ దాడులు మూన్నాళ్ల ముచ్చటగా మిలిగిపోకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *