రసమయి వ్యాఖ్యలపై దుమారం

ప్రజాగాయకుడు గద్దర్ ను కించపర్చే విధంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసినట్టు చెప్తున్న కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రసమయి వ్యాఖ్యలను నెటిజన్ల తప్పుబడుతున్నారు. తాను ఎమ్మెల్యే అయేసరికి గద్దర్ అసూయ చెందారని అందుకనే తనతో రెండు సంవత్సరాలుగా గద్దర్ మాట్లాడడం మానేశారంటూ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గద్దర్ అసూయ పడేంత స్థాయి రసమయికి లేదంటూ పలువురు వ్యాఖ్యానించారు. గద్దర్ తనకు ఆదర్శంగా చెప్పుకునే రసమయి గద్దర్ పై ఆ విధంగా మాట్లాడడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రసమయి బాలకిషన్ మాత్రం దీనిపై స్పందించలేదు.

ప్రస్తుతం మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న రసమయి బాలకిషన్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. పలు విషయాల్లో ఇప్పటికే రసమయిని వివాదాలు చుట్టుముట్టాయి. సాంస్కృతిక శాఖ ఛైర్మన్ గా రసమయి వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో తాజాగా ఈ వివాదం ఆయన మెడకు చుట్టుకుంది.