అధ్వానీ తప్పుకున్నారా…తప్పించారా…

లాల్ కృష్ణ అధ్వానీ భారత రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా పరిచయం అక్కరలేని పేరు. బాబ్రీ మసీదు విద్వసం కుట్ర కేసు మరోసారి తెరపైకి రావడంతో ప్రస్తుతం మరోసారి అధ్వానీ పత్రికల పతాక శీర్షికలకెక్కారు. బాబ్రీమసీదును కూల్చివేసిన ఘటనలో అధ్వానీతో పాటుగా బీజేపీ, వీహెచ్ పీ అగ్రనేతలపై మరోసారి విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత రాజ్యంగ అత్యున్నత పదవికి అధ్వానీ పేరు పరిశీలిస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపధ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఈతీర్పు అధ్వానీ ఆశలపై నీళ్లు చల్లినట్టుగానే భావిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో రాష్ట్రపతి పదవికి ఇక అధ్వానీ పేరును పరిశీలించే అవకాశం లేదని బావిస్తున్నారు.  సుప్రీం కోర్టు ఆదేశాల నేపధ్యంలో తాను రాష్ట్రపతి పదవి రేసులో  లేనంటూ అధ్వానీ స్వయంగా ప్రకటించారు కూడా…

చాలా కాలంగా అటకెక్కిన సీబీఐ కేసును మళ్లీ ఇటువంటి కీలక సమయంలో తెరపైకి తీసుకునిరావడం వెనుక రాజకీయ కారణాలున్నాయనేది అధ్వానీ వర్గీయుల అనుమానంగా కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ప్రభుత్వ వ్యవహారాలపై అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న అధ్వానీ పేరును ఆయన వర్గీయులు రాష్ట్రపతి పదవికోసం  సిఫార్సు చేశారు. ప్రధాని మోడికి అంతగా ఇష్టం లేకపోయినా ఈ మాజీ ఉప ప్రధానిని రాష్ట్రపతి గా చూడాలని ఆయన అనుచరులు భావించారు. అధ్వానీ-మోడీల మధ్య అంతగా సన్నిహిత సంబంధాలు లేకపోయినా మోడీ చేత అధ్వానీ పేరును సిఫార్సు చేయించగలిగారు. ఈ వ్యవహారంలో సుష్మాస్వరాజ్ లాంటి నేతలు కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.

అధ్వానీ పేరు రాష్ట్రపతి పదవికి తెరపైకి వచ్చిన వెంటనే పలు పరిణాలు జరిగాయి. అలహాబాద్ కోర్టు అధ్వానీ సహా పలువురు బీజేపీ కీలక నేతలకు ఇచ్చిన క్లీన్ చిట్ పై సీబీఐ సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేయడం వీరిపై విచారణకు సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం  చకచకా  జరిగిపోయాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఖచ్చితంగా అధ్వానీ రాష్ట్రపతి రేసు నుండి తనకు తానుగా తప్పుకునేట్టు చేశాయి. సుప్రీం కోర్టు తీర్పుతో తమకు ఏమాత్రం సబంధంలేదని మోడీ వర్గీయులు వాదిస్తున్నప్పటికీ ప్రభుత్వం చొరప చూపకుండా సీబీఐ కేసులో ఇంత ముందడుగు ఉండదనేది బహిరంగ రహస్యమే.

రాష్ట్రపతి పదవిని తమ రాజకీయ భవితవ్యం కోసం వాడుకోవాలని మోడీ వర్గీయులు భావిస్తున్నారు. అగ్రవర్ణాల పార్టీగా బీజేపీ పై పడ్డ ముద్రను పోగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా దళిత వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని మోడీ భావిస్తున్నారు. ఈ తరుణంలో అధ్వానీ పేరు ప్రచారంలోకి రావడంతో మోడీ మింగలేక కక్కలేక ఉండిపోయారు. కాగలకార్యం గంధర్వులే తీర్చరన్నట్టుగా ఇప్పుడు బాబ్రీమసీదు కేసు  అధ్వానీ చుట్టూ మరోసారి చుట్టుకోవడంతో మోడీకి ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్టే….