అధ్వానీ సహా బీజేపీ నేతలపై విచారణ

బాబ్రీమసీదు కూల్చివేత కుట్ర కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్.కే.అధ్వానీ, మురళీమనోహర్ జోషీ , ఉమా భారతి సహా పలువురికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాబ్రీమసీదు కూల్చివేతలో ఈ నేతల పాత్రపై విచారణ జరపాలంటూ సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణను రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాబ్రీమసీదు కూల్చివేత కేసులో అధ్వానీ సహా బీజేపీ కీలక నేతలకు ఊరట నిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ కేసులో అధ్వానీతో పాటుగా ఇతర నేతలను అలహాబాద్ హై కోర్టు నిర్థోషులుగా ప్రకటించి వారిపై విచారణను అలహాబాద్ హై కోర్టు నిలిపివేసింది. అయితే  ఈ కేసులో బీజేపీ కీలక నేతలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని 1992 డిసెంబర్ 6న కరసేవలకులు కూల్చివేశారు. ఈ ఘటన తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. కట్టడం కూల్చివేతకు సంబంధించి బీజేపీకి చెందిన కీలక నేతలతో సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. సీబీఐ విచారణ పూర్తయి ఈ కేసులో దోషులుగా తేలితే రెండు నుండి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.