హరీశ్ తో విభేదాల్లేవ్:కేటీఆర్

హరీశ్ రావుకు తనకు మధ్య గ్యాప్ పెరుగుతోందంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు. తాము పూర్తి సమన్వయంతో  పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ లోకి వేళ్తారంటూ కొంత మంది చేస్తున్నవి బుద్దిమాలిన ప్రచారం మాత్రమేనని అటువంటి అవకాశమే లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలతో మమేకం కావడానికి మాత్రమే తాను రాష్ట్ర వ్యాప్తంగా సభను నిర్వహిస్తున్నాను తప్ప ఇందులో మరో ఉద్దేశం  లేదని కేటీఆర్  పేర్కొన్నారు. త్వరలో సిద్దిపేటలోనూ సభలో పాల్గొంటానన్నారు. తాను సభలు నిర్వహిస్తున్న సమయంలోనే హరీశ్ రావు ఇంటర్వూలు ఇవ్వడం కేవలం యాదృచ్ఛికమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ చిన్న విషయాన్ని చిలవలు పలవలు చేయడం సరికాదన్నారు.

తనకు సీఎం అయిపోవాలన్న తపనలేదని కేటీఆర్ పేర్కొన్నారు. రానున్న 10 సంవత్సరాలు కేసీఆరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. కేసీఆర్ వయసు ఇప్పుడు 64 సంవత్సరాలని రాజకీయాల్లో అది పెద్ద వయసేంకాదనే సంగతి అందరికీ తెలుసన్నారు. తెలంగాణలో తమకు ప్రత్యామ్నాయమేలేదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని దేశం  మొత్తం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోతోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటోందన్నారు. గుజరాత్ లోనే బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయని చెప్పారు. షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు నిర్వహించడం ద్వారా లభపడాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అయితే తెలంగాణలో మాత్రం వారి ఆటలు సాగవన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.