అయ్యప్ప సన్నిధిలోకి మహిళల ప్రవేశం…?

కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలు వచ్చారంటూ జరుగుతున్న ప్రచారంపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలోకి 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళల రాకపై నిషేధం ఉంది. మహిళలను దేవాలయంలోకి అనుమతించరు. అయితే ఇటీవల కొందరు మహిళలు దేవాలయం సన్నిధానం వద్దకు వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. మహిళలు ఆలయం వద్ద ఉన్నట్టు తీసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం అసలు మహిళలు ఆలయం వద్దకు ఎట్లా వచ్చారనేదానిపై విచారణకు ఆదేశించింది. ఒక వేళ నిజంగా మహిళలు ఆలయంలోకి ప్రవేశించినట్టు రుజువైతే సంబంధింత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వం చెప్తోంది. మహిళలకు ప్రవేశం లేని శబరిమల ఆలయంలోకి వారు వచ్చారనే వార్తలపై పై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శబరిమలలోకి మహిళలను అనుమతించాలంటూ కొన్ని సంస్థలు చాలా కాలంనుండి డిమాండ్ చేస్తున్నాయి. మహిళలను ఆలయంలోకి రాకుండా అడ్డుకోవడం రాజ్యంగ ఉల్లంఘనే అవుతుందనేది వారి వాదన. రాజ్యంగం మహిళలకు కల్పించిన సమానత్వపు హక్కును కాలరాస్తు మహిళలను ఆలయంలోకి అనుమతించడాన్ని అడ్డుకోవడంపై వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదనలు సాగుతున్న దశలో కొంత మంది ఆలయంలోకి వచ్చారంటూ జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది.