ఎన్నికల గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ కు లంచం ఎరవేసిన అన్నాడీఎంకే శశికవర్గం ఇప్పుడు అడ్డంగా బుక్కయింది. దీనితో తమిళనాట రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండు గ్రూపులుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఒక వర్గానికి శశికళ నాయకత్వం వహిస్తుండగా మరో వర్గానికి పన్నీరు సెల్వం నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నిక సందర్భంగా రెండు వర్గాలు అన్నాడీఎంకే గుర్తు అయిన రెండాకుల కోసం పట్టుపట్టగా ఎన్నికల సంఘం ఏ వర్గానికి రెండు అకుల గుర్తును కేటాయించకుండా నిలిపి వేసింది. దీనితో రెండాకుల గుర్తును తమకు కేటాయించేలా చూడాలంటూ ఏకంగా ఎన్నికల సంఘానికి 50కోట్లు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినట్టు అన్నాడీఎంకే శశికళ వర్గంపై ఆరోపణులున్నాయి. ఈ మేరకు శశికళ జైకులు వెళ్లడంతో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఆమె బంధువు, అన్నా డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ పై కేసు నమోదయింది.
అర్కెనగర్ ఉప ఎన్నికలో ధన ప్రవాహం అడ్డు అదుపు లేకుండా సాగుతుండడంతో ఎన్నికల సంఘం ఇక్కడ జరగాల్సిన ఉప ఎన్నికను సైతం నిలిపివేసింది. రెండాకుల గుర్తును తమకే కాటాయించాలంటూ ఎన్నికల సంఘం వద్దకు వచ్చిన ఇరు వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపించుకున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరిస్తే రు.50కోట్ల రూపాయలు ఇచ్చేందుకు దినకరన్ సిద్దపడినట్టు సమచారం. ఈ మేరకు సుఖేశ్ చంద్ర అనే మద్యవర్తి ద్వారా ఎన్నికల సంఘానకి లంచం ఎరవేశారనే ఆరోపణలపై దినకరన్ పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఇప్పటికే వారు సుఖేశ్ చంద్రను అదుపులోకి తీసుకుని దినకరన్ అడ్వాన్స్ గా ఇచ్చినట్టు భావిస్తున్న కోటి 39 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల సంఘానికి 50కోట్ల రూపాయలు ఎరవేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దినకరన్ ను చాలా కాలంపాటు జయలలిత పార్టీకి దూరం పెట్టగా అమె మరణం తరువాత శశికళ ఆయనకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టడంతో పాటుగా పార్టీ బాద్యతలు అప్పగించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున శశికళ వర్గం తరపున దినకరన్ పోటికి దిగాడు. ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ఇక్కడ గెల్చేందుకు సర్వశక్తులు ఒడ్డిన అధికార పార్టీ చివరికి ఎన్నికల సంఘానికే లంచం ఇచ్చే దాగా వచ్చిందటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.