విజయవాడకు దేవినేని నెహ్రు బౌతికకాయం

విజయవాడ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం నేత దేవినేని నెహ్రు హైదరాబాద్ లో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయనకు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందారు. నెహ్రు అసలు పేరు దేవినేని రాజశేఖర్. విజయవాడలో నెహ్రు ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ నగరంలో తన పట్టును నిలుపుకున్నారు. మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన నాలుగు  సార్లు కంకిపాడు నుండి మరోసారి విజయవాడ తూర్పు నియోజకవర్గాల నుండి ఎంపికయ్యారు.

ఎన్టీఆర్ హయాంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నెహ్రూ విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో సాంకేతిక విద్యా శాఖ ను నిర్వహించిన నెహ్రూ తెలుగుదేశం పార్టీ చీలిక సమయంలో ఎన్టీఆర్ వెంటే ఉండిపోయారు. అటు తరువాత 2004లో కాంగ్రెస్ లో చేరిన నెహ్రూ ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 2009,2014 ఎన్నికల్లో నెహ్రూ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూవచ్చిన నెహ్రు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు.  నెహ్రుకు ఒక కుమారుడు, ఒక కుమారై ఉన్నారు. కుమారుడు ఇప్పటికే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నెహ్రు మరణంతో ఆయన అనుచరులు విచారంలో మునిగిపోయారు. నెహ్రు మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వెలిబిచ్చారు. హైదరాబాద్  లో మృతి చెందిన నెహ్రు బౌతిక కాయం విజయవాడకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో ఆయన  అభిమానులు నెహ్రు బౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు.