సీఎం కోసమే బస్సులు ఆపేశా:కేశినేని నాని

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కోసమే ట్రావెల్స్ వ్యాపారాన్ని మానేశానని కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా ట్రావెల్స్ వ్యాపారంలో నష్టాలు బాగా పెరిగాయని చెప్పారు. తాను నిజాయితీగానే  ట్రావెల్స్ ను నడిపానని అయినా తనపై లేనిపోనివి కల్పించి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై వచ్చినతప్పుడు ఆరోపణలతో మనస్థాపానికి గురైనట్టు నాని చెప్పారు. తాను బస్సులు నడుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నానే అరోపణలు విపరీతంగా వస్తున్నాయని దీని వల్ల పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెడ్డపేరు వస్తోందన్నారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం తనకు బాధకలిగించిందని చెప్పారు.

కేశినేని ట్రావెల్స్ ను అత్యంత సమర్థవంతగా నిర్వహించామని నాని పేర్కొన్నారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తమ ట్రావెల్స్ కు మంచి పేరుందని, దీని కోసం తాము చాలా కష్టాలు పడ్డామన్నారు. ట్రావెల్స్ ను తమ రాష్ట్రాల్లో నిర్వహించాలంటూ తనకు చాలా రాష్ట్రాల నుండి ఆహ్వానాలు అందుతున్నాయని కేశినేని నాని చెప్పారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తాను బస్సులు నడిపేది లేదని నాని స్పష్టం చేశారు.