ఖబద్దార్ పాకిస్తాన్…

b01fa173-2ac5-4e6e-8bef-bc5dcde78af5

భారత్ కు చెందిన కులభూషణ్ ను పాకిస్థాన్ అక్రమంగా నిర్భందించడంతో  పాటుగా సరైన విచారణ లేకుండానే అతనికి మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్ తీరుపై  భారతీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. పాకిస్థాన్ ఖభర్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ తీరుకు నిరసనగా పీ అండ్ టీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  కులభూషణ్ ను వెంటనే విడుదల చేయాలంటూ ర్యాలీ జరిగింది. సంక్షేమ సంఘ సభ్యులతో పాటుగా కాలనీ ప్రముఖుకు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవాలంటూ నినదించారు.

పాకిస్థాన్ ఒక  పక్క భారత్ లో ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటుగా దాన్నుండి ప్రపంచం దృష్టిని మరల్చడంకోసం కులభూషణ్ లాంటి వారిని బలిపశువులను చేస్తోందని పీ అండ్ టీ కాలనీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు.  అధ్యక్షుడు పీచర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాకిస్తాన్ సరైన విచారణ జరపకుండానే కులభూషణ్ పై గుఢాచార్య నెపంతో ఉరిశిక్షను విధించడం దారుణమన్నారు. ఇరాన్ నుండి అతడిని కిడ్నాప్ చేసి పాకిస్తాన్ లో అరెస్టు చేసినట్టుగా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ తీరును ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టాల్సిన అవసరం ఉందని ప్రధాన కార్యదర్శి బి.నాగరాజ్ అన్నారు. కులభూషణ్ ను విడుదల చేయించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. కులభూషణ్ వ్యవహారంలో పాకిస్తాన్ మళ్లీ తన కపట బుద్దిన బయటపెట్టుకుందని కార్యనిర్వాహక  కార్యదర్శి  వై.వి.రవికుమార్ దుయ్యబట్టారు. సరైన సాక్షాలు లేకుండా కులభూషణ్ కు ఉరిశిక్ష విధించడం దారుణమన్నారు. ఆయన్నువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.