తెలంగాణలో కాషాయజెండా ఎగరేస్తాం

తెలంగాణ రాష్ట అసెంబ్లీకి 2019లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ బీజేపీ కార్యకర్తలకు సూచించారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లీస్ పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్దికి సహకరిస్తుందని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నాయనేది తమకు సంబంధంలేదని అన్ని రాష్ట్రాలను అభివృద్ది పథంలోకి తీసుకుని పోవడమే కేంద్ర ప్రభుత్వ విధానమని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతోందన్నారు. సమర్థనాయకత్వంలో దేశం గతంలో ఎన్నడూ లేనంత ప్రగతిని సాధిస్తోందని చెప్పారు. ఒక్కొట్టిగా అన్ని రాష్ట్రాలు బీజేపీకి జై కొడుతున్నాయని త్వరలోనే తెలంగాణ కూడా బీజేపీ ఖాతాలో చేరిపోతుందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలం అయిందన్నారు. టీఆర్ఎస్ ది మాటల ప్రభుత్వం అని చేతలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజలను వంచించిన టీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ది చెస్తారన్నారు. మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసిందని ఆ స్పూర్తితో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ గెలుపు భువనగిరి నుండే ప్రారంభం అవుతుందని లక్ష్మణ్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌, బిజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి, వెదిరె శ్రీరామ్‌, కాసం వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *