కేశినేని ట్రావెల్స్ మూసివేత

తెలుగుదేశం ఎంపీకి చెందిన ప్రఖ్యాత కేశినేని ట్రావెల్స్ మూతపడింది. ప్రైవేటు బస్సు సర్వీసులలో తనకంటూ ఒక ప్రత్యేకతన సాధించిన కేశినేని ట్రావెల్స్ మూసేస్తున్నట్టు హఠాత్తుగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటుగా తమిళనాడు, కర్ణాటకలోనూ కేశీనేని ట్రావెల్ బస్సు సర్వీసులను నడుపుతోంది. తమ సంస్థ కార్యకలాపాను నిలిపివేస్తున్నట్టు కేశినేని నాని ప్రకటించారు. ఏపీ, తెలంగాణలతో పాటుగా తమిళనాడు, కర్ణాటకలలోని తమ కార్యాలయాను మూసేస్తున్నట్టు నాని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్టీఏ అధికారులతో ఏర్పడిన వివాదం కారణంగానే కేశినేని ట్రావెల్స్ ను మూసివేయాలనే నిర్ణయాన్ని నాని తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాల విషయంలో ఆర్టీఏ అధికారులతో ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఆర్టీఏ అధికారులతో వాగ్వాదానికి దిగిన కేశినేని నాని, బోండ ఉమలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనితో వీరిద్దరు ఆర్టీఏ అధికారుల వద్దకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా మనస్థాపం చెందిన నాని అసలు కేశినేని ట్రావెల్స్ నే మూసేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ట్రావెల్స్ మూసివేత వద్దంటూ చంద్రబాబు నాయుడు వారించినప్పటికీ తాను ఇకపై వ్యాపారం చేయలేనని నాని అన్నట్టు తెలుస్తోంది.