తమిళనాట ‘శవ’ పేటిక రాజకీయం

తమిళనాడు ఆర్.కె.నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పన్నీరు సెల్వం వర్గం జయలలిత శవపేటిక నమూనాతో ప్రచారాన్ని నిర్వహించడం సంచలనం గా మారింది. కాదేది ఎన్నికల ప్రచారానికి అనర్హం అన్నతీరులో ఏకంగా శవపేటికను ఎన్నికల ప్రచారంలో వినియోగించడం చర్చనీయాంశమైంది. జయలలిత మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్న పన్నీరులు సెల్వం వర్గం ఆర్.కె.నగర్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపిస్తే జయ మరణంపై విచారణ జరపాలనే తమ డిమాండ్ కు మరింత మద్దతు లభిస్తుందని ఓటర్లు చెప్తూ దానికోసం గాను జయ శవపేటిక నమూనాను ఎన్నికల ప్రచారానికి వినియోగించారు. దీనిపై శశికళ వర్గం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. శవపేటికలతో రాజకీయం చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. ఈ తరహా ప్రచారాన్ని నిర్వహించిన పన్నీరు సెల్వం వర్గంపై చర్యలు తీసుకోవాలంటూ శశికళ వర్గం డిమాండ్ చేస్తోంది.

ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో అధికార అన్నా డీఎంకే గుర్తు (రెండాకులు) తమకే కేటాయించాలంటూ అటు పన్నీరు సెల్వం, ఇటు శశికళ వర్గీయులు పట్టుపట్టడంతో ఎన్నికల కమిషన్ రెండాకుల గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది. తమిళ రాయకీయాల్లో పట్టు కోసం పన్నీరు సెల్వం, శశికళతో పాటుగా జయ మేనకోడలు దీపా కూడా ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి వారు అమ్మకు నిజమైన వారసులుగా ప్రచారం చేసుకుంటున్నారు.