రెచ్చిపోయిన శివసేన-అశోక్ గజపతిరాజుపై దాడికి యత్నం

పార్లమెంటు సాక్షిగా శివసేన ఎంపీలు రెచ్చిపోయారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుపై దాడిచేసినంత పనిచేశారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా సీనియర్ మేనేజర్ ను చెప్పుతో కొట్టిన ఘటనతో ఆయన్ను దేశంలోని విమానయాన సంస్థలు విమానం ఎక్కనీయకుండా నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా శివసేన ఎంపీలు గైక్వాడ్ కు మద్దతుగా నిల్చారు. ఎయిర్ ఇండియా ముందుగా గైక్వాడ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనపై మాట్లాడిన గైక్వాడ్ తన చర్యను సమర్థించుకున్నారు. తాను కంప్లైంట్ పుస్తకం ఇవ్వాలని మాత్రమే కోరానని అయితే దానికి ఎయిర్ ఇండియా సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించడంతో పాటుగా ప్రధానిని, పార్లమెంటును అవమానించే రీతిలో మాట్లాడారని అన్నారు. దీనితో కోపంతో అతనిపై చేయి చేసుకున్నానని జరిగిన ఘటనపై పార్లమెంటుకు క్షమాపణ చెప్తాను తప్ప ఎయిర్ ఇండియాకు కాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ గైక్వాడ్ ముందుగా ప్రయాణికుడని ఆతరువాతే ఎంపీ అనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు.  ఈ దశలో శివసేన, బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ముంబాయి నుండి ఒక్క విమానాన్ని కూడా ఎగరనీయమంటూ శివసేన ఎంపీలు హూంకరించారు. అశోక్ గజపతిరాజు వైపు శివసేన ఎంపీలు దూసుని వచ్చారు. దీనితో సభను వాయిదా వేశారు.

సభ వాయిదా పడిన తరువాత కూడా అశోక్ గజపతి రాజును శివసేన ఎంపీలు వదల్లేదు. ఆయన్ని చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. ఆయనపై దాదాపుగా దాడిచేసినంత పనిచేశారు. శివసేన ఎంపీలకు మంత్రి అవంత్ గీతే కుడా  మద్దతు పలికాడు.  సహచర మంత్రులు స్మృతి ఇరానీ, అహ్లూవాలియాలు గీతెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. వివాదం ముదరడంతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జోఖ్యం చేసుకోవడంతో వివాదం సర్థుమణిగింది.