కన్నులపండుగ్గా రాములోరి పెళ్లి

భదాద్రి రామయ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో జరిగిన ఈ కళ్యాణవేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రామయ్య పెళ్లిని చూసి తరించారు. సంప్రదాయ భద్దంగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ వేడుక కోసం భద్రాచల పట్టణాన్ని సుందరంగా అలంకరించారు. ముందుగా కల్యాణంలో భాగంగా పుణ్యాహవాచన కార్యక్రమం జరిగింది.  అందంగా అలంకరించిన  కల్యాణ వేదికపై ఉంచిన జల కలశానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవాచనం ముగిసిన అనంతరం కళ్యాణం ప్రారంభమైంది. సరిగ్గా 12.18 నిమిషాలకు భక్తుల హర్షధ్వానాల మధ్య సీతమ్మకు మాంగల్యధారణ జరిగింది. అనంతరం ప్రసిద్ధి చెందిన తలంబ్రాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.