మజ్లీస్ ను మట్టికరిసిస్తాం:బీజేపీ

రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుంటామని అందుకు అణుగుణంగా వ్యూహరచన చేస్తున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుండి వరుసగా ఎం.ఐ.ఎం గెలుస్తూ వస్తోందని రానున్న ఎన్నికల్లో ఈ రికార్డును తిరగరాస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక ముస్లీం ప్రభావిత ప్రాంతాల్లోనూ తాము గెల్చామని అదేవిధంగా హైదరాబాద్ స్థానాన్ని కూడా గెల్చుకుంటామని లక్ష్మణ్ చెప్పారు. ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టడం మినహా ఎంఐఎం ముస్లీంలకు ఒరగబెట్టింది ఏదీలేదని లక్ష్మణ్ ఆరోపించారు. మత రాజకీయాలు చేయడం తద్వారా ఓట్లు వేయించుకోవడం తప్పిస్తే వారిని అబివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే దేశాన్ని అబివృద్ధి పధంలోకి తీసుకుని పోగలరనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని అన్నారు. అందుకే అన్ని ప్రాంతాల ప్రజలు బీజేపీకి పట్టగడుతున్నారని చెప్పారు. మజ్లీస్ పార్టీ చేస్తున్న రాజకీయాలతో ప్రజలు విసుగెత్తిపోయారని రానున్న ఎన్నికల్లో ఆపార్టీని పక్కనపెట్టే ఆలోచనలో ప్రజలున్నారని లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ గెలిచే దిశగా ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నట్టు లక్ష్మణ్ చెప్పారు.