ఆస్ట్రేలియాలో భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. ఈ దాడిలో క్రైస్తవ మత ప్రబోధకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం ప్రకారం 48 కలథూర్ మాథ్యూ ఆస్ట్రేలియా నివాసం ఉంటున్నారు. కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాకు చెందిన ఈయన మెల్ బోర్న్ లోని చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా ఆయనపై దాడి జరిగింది. భారత్ కు చెందిన నువ్వు హింధు లేదా ముస్లీం వి చర్చీలో ప్రార్థనలు చేయడానికి వీలు లేదు అంటూ 72 సంవత్సరాల వ్యక్తి అఖస్మాత్తుగా మాథ్యూ పై కత్తితో దాడి చేశాడు. ప్రార్థనలకు వచ్చిన ఇతరులు అడ్డుకునే లోపే కత్తితో బలంగా పొడవడంతో మాథ్యూకు తీవ్రంగా గాయాలయ్యాయి.
నువ్వు భారతీయుడిని నిన్ను చంపేస్తా అంటూ దాడికి పాల్పడిన దుండగుడు ఉద్దేశపూర్వకంగానే భారతీయుడిపై దాడి చేసినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా జాత్యహంకార దాడిగానే చెప్తున్నారు. మాథ్యూను ప్రార్థనల సమయంలో వేసుకునే దుస్తులే కాపాడాయి. ఈ దుస్తులు మెడచుట్టూ మందపాటిగా ఉంటాయి. దీనితో కత్తి గట్టిగా దిగబడలేదు. వెంటనే మాథ్యూ ను ఆస్పత్రికి తరలించగా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పిన వైద్యులు చికిత్స తరువాత అతన్ని ఇంటికి పంపారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఇటలీ జాతీయుడని పోలీసులు తెలిపారు.