మా "దినం" ఎప్పుడో పెట్టేశారుగా…(ఓ పిట్ట కథ)

   by: B.Mrunalini
మా సోదరుడు కోడి గారితోనే మాకు పోటీ… ఆయన అరుపులతో పాటుగా  మా కిచకిచలావారలతో పల్లెలు, పట్టణాలు మెల్కొనేవి. ఏ ఇంట్లో చూసినా మా హడావిడే. పెంకుటి చూర్లు, దూలాల సందులు, వెంటిలేటర్లు ఇవే మా ఆవాసాలు… అదేంటో కానీ మా మీద మీ మానవులకు ప్రేమ కాస్త ఎక్కువే పండిన పంట గింజలను మా కోసం వేలాడదీసేవారు. వాటి నుండి రాలిపడిన గింజలను ఏరుకుని తింటూ జల్సాగా బితికేవాళ్లం. మనుషులతోనూ… మమతలతోనూ మాకు మాకు విడదీయరాని బంధం… ఏ చిన్నారికైనా మా పిల్లలను చూపిస్తే ఇట్టే ఏడుపు ఆగిపోయేది. అన్నం తిననని మారాం చేసే బాబులకు మా పిల్లలకు మేము తినిపించే ఆహారాన్ని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేవారు. ప్రతీ ఇంట్లోనూ ఇటువంటి దృశ్యాలు సర్వసధారణంఇట్లా మాకు మీతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఇళ్లలో మేం చేసే కిచకిచలావారాలు పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తే పెద్దలలో ఉత్సాహాన్ని నింపేది.
మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి మేమే గొప్ప ఉదాహరణ. ఇట్లాంటి సమయంలో మనిషిలో పుట్టిన ఆశకి బలైన పోతున్న జీవాలమూ మేమే… ప్రకృతితో సహవాసం వదిలి వికృతితో స్నేహం మొదలుపెట్టారు మీ మానవులు… అధిక పంటల కోసం ఇష్టం వచ్చినట్టి క్రిమిసంహారక మందులను వెదజల్లారు. ఆ మందులు చీడలతో పాటుగా మా ఉసురు కూడా తీశాయి. లక్షలాదిగా కనిపించిన మేము ఇప్పుడు వందల సంఖ్యలోకి పడిపోయాం. మీ ఇళ్లు విశాలంగా మారిపోయినా మనసులు మాత్రం ఇరుకై పోయాయి. పెంకుటిల్లు పోయి డాబా మేడలు వెలిసి మాకు నిలువ నీడ లేకుండా చేశాయి. మా ఆవాసాలన్నీ మీ స్వార్థానికి ఉపయోగపడ్డాయి. పట్టణాల్లో గూళ్లు కరువై మా గుండెలు చెరువై పోయాయి. చల్లగాలి మోజులో మానవుడు ఇంటి తలుపులను మూసేసి, గాలిదూరే సందులను కూడా లేకుండా చేసి మాకు నిలువనీడ లేకుండా చేశాడు. మీరు చల్లే మందుల ప్రభావంతో మా ఒళ్లు గుల్లకాగా మా ఇళ్లు ఖాళీ అయ్యాయి. దీంతో మేము దిక్కులేని పక్షలుగా మిగిలిపోయాం.
అప్పటికే మా సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నా సాంకేతిక మోజులో పడి మా ఉనికినే మర్చిపోయారు. పడుతూ లేస్తూ బతుకుతున్న మా పాలిట మీ ఫోన్లు మరింత ముప్పును తెచ్చిపెట్టాయి. సెల్ లేకపోతే సర్వం కోల్పోయిన వారిలాగా మీరు తయారు కావడంతో ప్రతీ చోటా వెలిసిన సెల్ టవర్ల మమల్ని మరింత దెబ్బతీశాయి. వాటి రేడియేషన్ ప్రబావానికి మా ఊపిరి ఆగిపోయింది. ఈ భూమి మీద మమకారంతో మేమూ ఉన్నామంటూ మీకు అడపాదడపా గుర్తు చేస్తున్నా మా సంఖ్య ఇప్పుడు వేళ్లమీద లెక్కపెట్టే స్థాయికి చేరేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంతరిస్తున్న జాతుల్లో మాదీ ఒకటిగా మళ్లీ మీ శాస్త్రవేత్తవేత్తలే గుర్తించారు. మీరు మాకు ఎప్పుడో దినం పెట్టేయగా మళ్లీ మా పేరు మీద ఒక దినాన్ని ఏర్పాటు చేశారు. ఓరి మానవుడా నీ స్వార్థంతో ప్రకృతితో ఆటలు ఆడుకుంటున్నావు. దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు ఇప్పటికే అనుభవిస్తున్నా ఇంకా నీ స్వార్థం కోసం మీతో పాటు మమ్మల్ని కూడా బలిచేస్తున్నావు. నీచావు నువ్వు చావు కానీ నీ స్వార్థానికి మమ్మల్ని బలిచేసే అధికారం నీకెక్కడిది. ఒకప్పుడు మమ్మల్ని ఆదరించి చేరదీసిన నీవు మాకు దేవుడిగా కనిపించావు. నీ కథలను మా పిల్లలకు చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు నీ రూపం మా అంచనాలకు కూడా అందడం లేదు. ఓరీ మానవుడా కనీసం ఇప్పటికైనా మేలుకుని మాతో పాటుగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. ఇంతరి నా పేరు చెప్పలేదు కదా… ఇంకా తెలియలేదా… అదే బాబు “ఊర పిచ్చుకని”
(ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *