జయ మేనకోడలు దీపకు భర్తతో విభేదాలు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి మేనకోడలు దీపా జయకుమార్ కు ఆయన భర్త మాధవన్ కు మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. జయలలిత జయంతి రోజుల దీప స్థాపించిన    ‘ఎంజీఆర్‌ అమ్మ దీపా పెరవి’ పార్టీ నుండి వైదొలుగుతున్నట్టు మాధవన్ ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీ అదృశ్య శక్తుల చేతుల్లోకి వెళ్లిందని అందుకే తాను పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించిన మాధవన్ త్వరలోనే తాను కొత్త పార్టీని పెడుతున్నట్టు ప్రకటించారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దీప పోటీకి దిగుతున్న తరుణంలో భర్త నుంచే పార్టీ పై విమర్శలు రావడం ఖచ్చితంగా దీపకు ఎదురుదెబ్బే. మాధవన్-దీపా జయకర్ కు మధ్య రేగిన చిచ్చు ప్రభుత్వ పెద్దల చలవేనని దీప మద్దతుదారులు అంటున్నారు. ప్రజల్లో దీపకు మద్దతు పెరుగుతుండడంతో తట్టుకోలేని ప్రభుత్వంలోని పెద్దలు దీప భర్తను ప్రలోభాలకు గురిచేసి తమవైపుకు తిప్పుకున్నారని అంటున్నారు.
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు ఆమె భర్తకు మొదటి నుండి పెద్దగా సఖ్యత లేదనే ప్రచారం కూడా సాగుతోంది. వారిద్దరి మధ్య పెళ్లి అయిన కొత్తలోనే విభేదాలు పొడచూపాయని అంటున్నారు. జయలలిత మరణానికి కొద్ది రోజుల ముందే వీరిద్దరూ తిరిగి సన్నిహితంగా ఉంటున్నారని, జయ మరణంలో దీపాజయకుమార్ రాజకీయ రంగప్రవేశం చేయడం ఆమెకు ప్రజల మద్దతు లభించడంతో మాధవన్ దీపాకు తోడుగా ఉంటూ వచ్చాడని చెప్తున్నారు. రాజకీయ పార్టీ ప్రకటించిన సమయంలో దీపకు తోడుగా ఉన్న మాధవన్ దీపను విమర్శిస్తూ పార్టీ నుండి బయటికి రావడం వెనుక కొంత మంది హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాధవన్ ను ప్రలోభాలకు గురిచేసి అతన్ని తమవైపు తిప్పుకున్నారని అంటున్నారు.
దీపా జయకుమార్ క్రైస్తవ మతం పుచ్చుకున్నారంటూ ప్రచారం చేసిన ఈ వర్గాలే ఇప్పుడు భార్యా భర్తలను విడతీశారని దీప మద్దతుదారులు అంటున్నారు. మాధవన్ క్రిస్టియన్ అని ఆయన్ని పెళ్లి చేసుకున్న దీప కూడా మతం మార్చుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై దీప ఎటువంటి ప్రకటన చేయలేదు. దీప తన పేరును కూడా మార్చుకున్నారని ఆమె వ్యతిరేకులు తెరపైకి తెచ్చారు. రోజుకో మలుపుతో తమిళ రాజకీయాలు ఆశక్తిని కలిగిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *