ఏపీ అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా ఆయన కుమారై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భావోద్వేగ ప్రపంసం సభలో ఉద్విగ్న వాతావరణాన్ని నెలకొల్పింది. తండ్రిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టిన అఖిల ప్రియ కొత్త అసెంబ్లీలో తాను మొదటి సారిగా తన తండ్రి సంతాప తీర్మానం పై మాట్లాడడం బాధగా ఉందన్నారు. భూమా నాగిరెడ్డి చిన్నప్పటి నుండి అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. చిన్నతనంలోనే తల్లిని పోగుట్టుకున్న భూమా ఆ తరువాత వరుసగా ముగ్గురు సోదరులను పోగొట్టుకున్నారని అన్నారు. తమది ఉమ్మడి కుటుంబమని తమ పెదనాన్ని పిల్లలను తమతో సమానంగా పెంచిపెద్దచేశారని చెప్పారు. తమ కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తన తండ్రితోనే చెప్పుకునే వారని అన్నారు. అన్ని సమస్యలను నిబ్బరంగా ఎదుర్కొన్న తన తండ్రి తన తల్లి చనిపోయిన నాటి నుండి నైరాశ్యంలో మునిగిపోయారని తెలిపారు. ఆ వెలితి నుండి ఆయన్ను బయటకు తీసుకుని వచ్చేందుకు తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని అఖిల ప్రియ చెప్పారు.
గత వారంరోజులుగా తన తండ్రి ఆరోగ్యం సరిగాలేదని అఖిల ప్రియ చెప్పారు. ఆస్పత్రిలో ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల గురించే ఆలోచించారని తాము వారించినా ఆయన తన ఆరోగ్యాన్నిసైతం లెక్క చేయకుండా పనిచేశారనన్నారు.ఆస్పత్రిలో ఉండి కూడా టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారని చెప్పారు. అసెంబ్లీకి రావాలని తనను ఎవరు బలవంత పెట్టలేదని తను తానుగా తండ్రి సంతాప సభలో మాట్లాడాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీకి వచ్చానని అన్నారు. తన తల్లిదండ్రులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం తన బాధ్యతని అన్నారు. తన తండ్రిని రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తనకు, తన కుటుంబానికి ధైర్యం చెప్పిన సీఎంకు ఇతర నేతలకు అఖిల ప్రియ కృతజ్ఞతలు తెలిపారు. విపక్షం సంతాప తీర్మానం పై మాట్లాడక పోవడం బాధగా ఉందని చెప్పారు.