చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో 11 మంది జవాన్లు ఇద్దరు మావోయిస్టులు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు జవాన్లను ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ కు తరలించారు. మావోయిస్టులకు గట్టి పట్టున్న సుకుమా జిల్లా బెజ్జి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ 219 బెటాలియన్ కు చెందిన జవాన్లు గాలింపు జరుపుతుండగా ఐఈడీ అమర్చి దాన్ని పేల్చారు. వెంటనే జవాన్లను చుట్టుముట్టి జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని హుటాహుటిన చత్తీస్ ఘడ్ రాజధానికి తరలించారు. జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మవోలు మృతిచెందినట్టు భావిస్తున్నారు. మరికొంత మందికి కూడా తీవ్రంగా గాయపడి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలతో దిక్కుతోచని స్థితిలో పడ్డ మావోలు మరోసారి పోలీసులను లక్ష్యంగా చేసుకుని విరుచుకుని పడ్డారు. గాలింపు జరుపుతున్న జవాన్లను బలితీసుకున్నారు. ఈ ఘటనతో సుకుమా జిల్లాలో మరోసారి తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు బలగాను తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.