యూపీ లో బీజేపీ ఎందుకు గెల్చింది

దేశ రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దుసుకుని పోతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో భారీగా సీట్లను సంపాదించుకున్న బీజేపీ తిరిగి అదే ఊపును కొనసాగిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుగులేని మెజార్టీని సాధిస్తోంది.  ఆధికార సమాజ్ వాదీ, కాంగ్రెస్ ల కూటమికి గానీ, బీఎస్పీకానీ  భారతీయ జనతాపార్టీకి కనీసం పోటీ ఇవ్వగలిగే స్థితిలో లేకుండా పోయాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ఒకప్పుడు చక్రం తిప్పి ఆ తరువాతి కాలంలో ప్రాభవం కోల్పోయిన బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల్లో కులాలదే ప్రధాన భూమిక. ఇక్కడ ఓట్లు కులాల ప్రాతిపదికనే పడతయానేది బహిరంగ రహస్యమే. అయితే తాజా ఎన్నికల ఫలితాలు మాత్రం ఇందుకు కొద్ది భిన్నంగా కనిపిస్తున్నాయి. యూపీలో కుల రాజకీయాలకు ప్రజలు విసిగిపోయినట్టు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి నడిపిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాలను ప్రజలు నమ్మి ఆ పార్టీకి పట్టం కట్టారు.
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ గెల్చింది అనేక కంటే ఇతర పార్టీలు ఓడాయి అనడం సమంజసమేమో. కుల రాజకీయాల్లో పూర్తిగా మునిపోయిన సమాజ్ వాదీ పార్టీ ఏలుబడిలో అరాచకం రాజ్యమేలింది. శాంతిభద్రతల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అధికార పార్టీ నేతల దాదాగిరికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. దీనికి తోడు సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల ముందు పతాక స్థాయికి చేరుకుని పార్టీతో పాటుగా కుటుంబంపు బరువు బజారున పడింది. ఇన్నాళ్లు సమాజ్ వాదీ పార్టీని అంటిపెట్టుకున్న వర్గాలు తండ్రీ కొడుకుల మధ్య తగవులాటలతో ఇతర పార్టీలవైపు మొగ్గుచూపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసినా అది ఏమాత్రం ఫలితాన్ని చూపించలేక పోయింది.  అభివృద్దికి ఆమడ దూరంలో నిల్చిపోయిన ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయినట్టు కనిపిస్తోంది. ఇక అంతకు ముందు బీఎస్పీ పరిపాలనను ప్రజలు మర్చిపోలేదు. పూర్తిగా అవినీతి కూపంలో కూరుకుని పోయిన బీఎస్పీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా గట్టెక్కాలని చేసిన ప్రయత్నాలకు ప్రజలు గట్టిగానే బుద్దిచెప్పారు. అధికారంలోకి వస్తానంటూ బీరాలు పలికిన బీఎస్పీ అధినేత్రి మాయావతికి ప్రజలు గట్టిగానే బుద్ది చెప్పారు. 403 అసెంభ్లీ స్థానాలున్న యూపీలో మూడు పదుల స్థానాలు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. యూపీలో ఎన్నడో ప్రజలకు దూరం అయిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇంకా అక్కున చేర్చుకోలేకపోతున్నారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా ఆ పార్టీ పరిస్థితిలో మార్పులేదు. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని లాభం పొందాలనుకున్న కాంగ్రెస్ కు ఆశాభంగంమే ఎదురైంది.
విపక్షాల బలహీనతలకను బీజేపీ చక్కగా తనకు అనుకూలంగా మార్చుకుంది. కులాల వారీ మద్దతు సంపాధించుకుంటునే అభివృద్ది నినాదంతో మద్యతరగతికి దగ్గరయింది. ఉత్తర్ ప్రదేశ్ లో మోడీ మంత్ర పనిచేసిందని ఇక్కడ గెలుపు క్రెడిట్ మొత్తం మోడీదేనంటూ బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నా మోడీ మానియా కన్నా స్థానిక పరిస్థితులే బీజేపీని గెలిపించాయి. వైరి పక్షం బలహీనతలు బీజేపీ బలంగా మారి పార్టీకి ఘన విజయాన్ని అందించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *