భారత జాలర్లను కాల్చి చంపిన శ్రీలంక

శ్రీలంక నావికాదళం జరిపిన కాల్పుల్లో భారత్ కు చెందిన ఒక మత్స్యకారుడు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన జాలర్ల మర పడవలో చేపలవేట జరుపుతుండగా శ్రీలంక నేవీ కాల్పులు జరిపింది. తాము కట్చాతీవ్ ద్వీపం ప్రాంతంలో చేపలవేట జరుపుతుండగా తమపై శ్రీలంక దళాలు కాల్పులు జరిపాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ కాల్పుల్లో బ్రిడ్జో అనే 22 ఏళ్ల జాలరి అక్కడికక్కడే చనిపోయాడు. అతని మెడ నుండి తూటా దుసుకుని పోయింది. మరో జాలరి శరవణన్ తీవ్రంగా గాయపడ్డారు. జాలర్లపై శ్రీలంక జరిపిన కాల్పులను తమిళనాడు మత్స్య శాఖ దృవీకరించింది. చేపలవేట సాగినస్తున్న భారత మర పడవ వద్దకు చేరుకున్న శ్రీలంక నేవీ వెంటనే కాల్పులు జరిపిందని కనీసం హెచ్చరికగా గాలిలో కాల్పులు జరపకుండా నేరుగా జాలర్లపై కాల్పులు జరిపిందని భారత అధికారులు పేర్కొన్నారు.
భారత జాలర్లపై శ్రీలంక నేవీ జరిపిన దాడులపై తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఇటీవల కాలంలో శ్రీలకం భారత జాలర్ల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని జాలర్ల సంఘ ప్రతినిధులు అంటున్నారు. శ్రీలంక నేవీ విచక్షణా రహితంగా జరుపుతున్న కాల్పుల్లో భారత జాలర్లు మృత్యువాతపడుతున్నారని వారు చెప్పారు. దాదాపు 2వేల మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ ఇటీవల కాలంలో అదుపులోకి తీసుకుందని వారు చెప్పారు. కాల్పులకు దిగడం, జాలర్లను అదుపులోకి తీసుకోవడం వంటి చర్యల ద్వారా శ్రీలంక నేవీ దాడులు తీవ్రం అయ్యాయని వారు అంటున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భారత జాలర్ల ప్రాణాలు తీస్తున్న శ్రీలంక నేవీ కి తగిన గుణపాఠం చెప్పాలంటున్నారు. భారతీయ జలాల్లోకి వచ్చిమరీ కొన్ని సార్లు జాలర్లను అదుపులోకి తీసుకుంటున్నారని అంటున్నారు. దారితప్పి శ్రీలంక జలాల్లోకి వెళ్లిన వారి పట్ల కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని జాలర్లు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *