ముంబాయిలో ఉగ్రవాద దాడికి పథకరచన పాకిస్థాన్ లోనే జరిగినట్టు ఆ దేశానికి మాజీ అధికారి ఒకరు వెల్లడించారు. దిల్లీలో ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ ఆధ్వర్యంలో జరిగిన 19వ ఏషియన్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నపాకిస్థాన్ భద్రత మాజీ సలహాదారు మహమూద్ అలీ దుర్రానీ ఈ విషయాన్ని చెప్పారు. ముంబాయిలో జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు పాల్గొన్నారు. వారు పాకిస్థాన్ నుండి భారత్ లోకి ప్రవేశించి ఈ దాడులు చేశారని ఆయన చెప్పారు. ముంబాయి ఉగ్రదాడుల సమయంలో దుర్రానీ పాకిస్థాన్ లో అత్యున్నత కీలకమైన పదవిలో ఉన్నారు. పాకిస్థాన్ భూబాగంలోనే ముంబాయి దాడులకు పథకరచన జరగిందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ పథకంలో పాకిస్థాన్ ప్రభుత్వం కానీ, ఐఎస్ఐ కానీ పాలు పంచుకోలేదన్నారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలు ఈ దారుణానికి ఒడికట్టాయని పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇందులో ప్రమేయం లేదని చెప్పారు.