అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదటిసారిగా రాజధాని అమరావతిలోని వెలగపూడిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో ప్రరంభం అయ్యాయి. గత అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించగా తాజాగా ఈ సమావేశాలను నూతన రాజధానిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన మంత్రివర్గ సహచరులు అంతా కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తరువాత సమావేశాలకు వచ్చారు. అటు విపక్ష నేత జగన్ కూడా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో సమావేశాలకు హాజరయ్యారు. వారు ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసిన తరువాత సమావేశాలకు హాజరయ్యారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా శాసనసభ, సాశనమండలిని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. అతి కొద్ది సమయంలోనే నూతన అసెంబ్లీ భవనాన్ని నిర్మించిన ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ అభినందించారు. కొత్త అసెంబ్లీ భవనంలో సభను జరుపుకోవడం హర్షణీయమన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. సొంత గడ్డపై అసెంబ్లీ సమావేశాలను నిర్వహించుకోవడం చారిత్రాత్మక ఘటనగా చంద్రబాబు అభివర్ణించారు. తమ ప్రభుత్వం అభివృద్దికోసం చిత్తశుద్దితో పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని రాజధాని పనులు శరవేగంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. కరెంటు కొరతను, సాగునీటి సమస్యను అధిగమిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంలో అలసత్వానికి తావులేదని చెప్పారు. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేసి ప్రజలకు సాగునీటిని అందించామని చెప్పారు.