కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి రాకుండా చేస్తున్నారని వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీకి చెందిన ట్రావెల్స్ కావడం వల్లే వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. బస్సు ప్రమాదం జరగడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని వారంటున్నారు. పోలీసులు, అధికారులు కుమ్మక్కయి నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు తెలుసుకునేందుకే తమ పార్టీ అధినేత జగన్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారని చెప్పారు. జగన్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి రావడం, బాధితులను పరామర్శించడం తప్పు అనే విధంగా తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వారు అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చిన జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, బాధితులను పరామర్శించకుండా అడ్డుకోవడాన్ని చూస్తుంటే నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలకు బలం చేకూరురుతోందన్నారు.
ఒక విపక్ష నేతగా జగన్ బస్సు ప్రమాదం జరగిన ప్రాంతానికి రావడం తప్పా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజాలు చెప్పాలంటూ నిలదీసినందుకే జగన్ పై అక్రమ కేసులు పెడుతున్నారని వారు ఆరోపించారు. కలెక్టర్ ఎ.బాబు ట్రావెల్స్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిజాలను బయటికి రానీయడం లేదన్నారు.