ఇళ్లపై దాడులు-రైళ్లలో వేధింపులు

అమెరికాలో జాతి వివక్ష ఘటనలు అక్కడి తెలుగు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల జాతి వివక్షతతో ఇద్దరు తెలుగు వ్యక్తులకు జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల అనే తెలుగు వ్యక్తి మృతి చెందడంతో అమెరికాలోని తెలుగువారంతా తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. మరో వైపు భారతీయుల ఇండ్లపై అక్కడక్కడా దాడులు, బహిరంగ ప్రదేశాల్లో దుషణలు సాధారణం అయ్యాయి. ఇటువంటి ఘటనల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో తెలుగు వారికి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని ప్రవాస తెలుగు సంఘాలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అమెరికాలో ఉంటున్న తెలుగు వారి బంధువుల్లో ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు.
అమెరికాలోని పీటన్ నగరంలోని ఒక భారతీయుడి ఇంటిపై దాడి జరిగింది. ఇంటిపై కోడిగుడ్లను విసరడంతో పాటుగా గోడలకు కుక్క అశుద్దాన్ని రాశారు. ఇండియన్లు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలంటూ రాతలు రాశారు. దాదాపు 50 పైగా పోస్టర్లను అతికించడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు భరోసా ఇస్తున్నా ఈఘటనతో అక్కడి భారతీయుల్లో కలకలం రేపింది. మరో వైపు న్యూయర్క్ మెట్రో రైల్ లో ఒక భారతీయ యువతిని అమెరికాన్ వేధింపులకు గురిచేశాడు. సదరు యువతిని నోటికి వచ్చినట్టు తిట్టడంతో పాటుగా భారత్ పై కూడా నోరు పారేసుకున్నాడు. భారతీయులు ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ తిట్ల దండకం అందుకున్నాడు. రైల్లో ఉన్న వారెవరు యువతికి మద్దతు పలక్కపోవడంతో సదరు వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. దీనితో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువతిని రక్షించాల్సి వచ్చింది.
అమెరికాలో జరుగుతున్న వరుస సంఘటనలతో అక్కడ ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటువంటి ఘటనలతో బెదిరిపోవాల్సిన అవసరం లేదని ప్రవాస భారతీయుల సంఘాలు భరోసా ఇస్తున్నాయి. భయపడవద్దని కానీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎవరితోనూ వాదనకు దిగవద్దని అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *