పాపం ఏపీ మంత్రులు

ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమకు కేటాయించిన ఛాంబర్ల పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ నుండి సచివాలయాన్ని అమరావతికి తీసుకుని వెళ్లిన  తరువాత మంత్రులకు కేటాయించిన ఛాంబర్లు ఇరుగ్గా ఉన్నప్పటికీ వాటిని త్వరలోనే మారుస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఛాంబర్లను మార్చే అవకాశం లేదని తేలిపోవడంతో పాపం మంత్రులు ఉన్న ఛాంబర్లనే సర్థుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఛాంబర్ల విషయంలో ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడకపోయినా అంతరంగికూల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మంత్రులకు కేటాయించిన ఛాంబర్లు, పేషీలు చాలా చిన్నగా ఉన్నాయని వారు వాపోతున్నారు. ఛాంబర్లలో ఉన్న సౌకర్యాలు కూడా అంతంతమాత్రమేనని పెదవి విరుస్తున్నారట. ఛాంబర్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఏసీలు పనిచేయకపోవడం, కనీసం క్యాంటిన్ కౌకర్యం లేకపోవడం మంత్రులను అసంతృప్తికి గురిచేస్తున్నా దీని గురించి మోరు మెదిపే సాహసం చేయడం లేదట మంత్రులు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సచివాలయం అద్భుతంగా ఉందని చెప్పడంతో మంత్రులంతా ఆయనకు వత్తాసు పలక్క తప్పడం లేదట.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి వద్ద నిర్మించిన సచివాలయంలో మొత్తం ఆరు బ్లాక్ లు ఉన్నాయి. వీటిలో నాలుగు బ్లాక్ లు మంత్రులకు కేటాయించగా ఐదవ బ్లాక్ ను ముఖ్యమంత్రి కి కేటాయించారు. ఆరవ బ్లాక్ ను అసెంబ్లీ కోసం కేటాయించారు. నాలుగు బ్లాక్ లలో మంత్రులకు కేటియించి ఛాంబర్లలో పట్టుమని నలుగురు కూర్చొనే సౌకర్యం లేదని మంత్రులు వాపోతున్నట్టు సమాచారం. పేషీల కోసం కేటాయించిన  స్థలం అయితే మరీ చిన్నవిగా ఉన్నాయని అంటున్నారు. దీనికి తోడు సరైన క్యాంటిన్ సౌకర్యం లేక మంత్రుల ఛాంబర్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. హైదరాబాద్ లో ఉన్నప్పుడు పోలీస్తే ఇక్కడ సౌకర్యాలు అసలు ఏమాత్రం సరిగా లేవని పెదవివిరుస్తున్నా దానిపై గట్టిగా మాట్లాడే సాహసం చేయడం లేదట. మంత్రుల ఛాంబర్ల వద్ద కనీసం క్యాంటిన్ సౌకర్యం కూడా లేకపోవడంతో తమ వద్దకు వచ్చే వారికి కనీసం కాఫీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోవడం మంత్రులకు తలనొప్పిగా మారింది.
మొత్తం మీద కొత్త సచివాలయంలో మంత్రులు అసౌకర్యంగానే ఫీలవుతున్నా కొత్త రాజధాని కనుక కొన్ని తాత్కాలిక ఇబ్బందులు తప్పవని అవన్నీ త్వరలోనే సమసి పోతాయని మంత్రులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *