ముంబై పీఠం-ఎవరి పరం

ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో అనే ఉత్కంఠ సాగుతోంది. గత 25 సంవత్సరాలుగా ముంబై మోయర్ పదవిని పొందుతూ వస్తున్న శివసేన ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ పీఠాన్ని సాధించడానికి అవసరమైన మెజార్టీని సొంతం చేసుకోలేకపోయింది. 227 డివిజన్లు ఉన్న ముంబయి   కార్పోరేషన్ లో శివసేన 84 డివిజన్లలో విజయం సాధించగా 82 డివిజన్లను బీజేపీ సొంతం చేసుకుంది. 31 డివిజన్లతో కాంగ్రెస్ తృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా నలుగురు ఇండిపెండెట్లు బీజేపీకి మద్దతు ప్రకటించిడంతో బీజేపీ స్కోరు 86కు చేరుకుంది. మేయరు పీఠానికి కావాల్సిన డివిజన్ల సంఖ్య 114.
ముంబయి మేయర్ పదవిని తమ పార్టీనే సొంతం చేసుకుంటుందని శివసేన ధీమాతో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా బరిలో నిల్చిన శివసేన అత్యధిక స్థానాల్లో గెల్చిన పార్టీగా తమ పార్టీనే మేయర్ పీఠాన్ని అధిరోహిస్తుందని అంటోంది. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు కట్టే ప్రశ్నే లేదని శివసేన  తెగేసి చెప్తోంది. బీజేపీ అక్రమ పద్దతుల ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని శివసేన ఆరోపిస్తోంది. ఓట్ల గల్లంతుతో సహా పలు అక్రమాలకు పాల్పడిన బీజేపీ 82 స్థానాల్లో గెల్చిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. శివసేన ను అస్థిర పర్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం లేదని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మేయర్ పదవికోసం అటు శివసేన ఇటు బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీలు తిరిగి దగ్గరికి వస్తాయా లేక ఇతరుల సహాయంతో మేయర్ పదవిని చేపడతారా అనేది తేలాల్సి ఉంది. 31 డివిజన్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరికీ మద్దతు పలికే పరిస్థితి కనిపించడం లేదు. దేశంలోనే అత్యంత ధనవంతమైన ముంబై కార్పోరేషన్ పీఠం ఎవరికి దక్కుతుందో మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *