త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ…?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అయినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటనను పూర్తిచేసుకుని వచ్చిన తరువాత నామినేటెట్ పోస్టుల భర్తీని చేపడతారని వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. రకరకాల కారణాల వల్ల పోస్టుల భర్తీని చేయడం లేదు. అయితే ఈ దఫా ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులను ఇస్తారని పార్టీ వర్గాలు గట్టిగానే చెప్తున్నాయి. వివిధ చిన్నా పెద్ద పదవులు కలుపుకుని దాదాపు మూడు వేల దాగా నామినేటెడ్ పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా పార్టీలోనూ పదవులను నింపేందుకు కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది.
నామినేటెడ్ పోస్టులతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ పోస్టుల భర్తీ అధిష్టానానికి కత్తిమీద సాముగానే తయారయింది. ఉన్న పోస్టుల సంఖ్య కన్నా చాలా ఎక్కువ మొత్తంలో ఆశావాహులు పదవుల కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలతో పాటుగా పలువురు తెలంగాణ వాదులు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం కాచుకుని కూర్చొని ఉన్నారు. ఈ నేపధ్యంలో అందరినీ తృప్తి పర్చడం టీఆర్ఎస్ పెద్దలకు కష్టంగా మారింది. ఈ కారణంగానే ఇప్పటికి చాలా సార్లు నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతూ వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండీ చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల పై ఆశలు పెంచుకున్నారు. తమకు పోస్టులు ఖాయం అని ఇప్పటికే వారు ప్రచారం చేసుకున్నారు. పోస్టులు ఆశిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పాటుగా పార్టీలో వస్తున్న వత్తిడి కారణంగా కేసీఆర్ ఈ పోస్టుల భర్తీ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పదవీ కాలం సగానికి పైగా పూర్తయిన నేపధ్యంలో నామినేటెడ్ పోస్టుల కోసం కేసీఆర్ పై కూడా విపరీతంగా వత్తిడి వస్తోంది. ఇటీవల కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని కలిసిన నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పై కూడా పనిలో పనిగా కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దీనితో పదవుల భర్తీని ఇంకా ఆలస్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన కేసీఆర్ ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన జాబితా సిద్ధం అయిందనే ప్రచారం సాగుతోంది. వాటిలో పెద్దగా మార్పులు లేకుండా కేసీఆర్ పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది.
నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన సమారం పేర్లను ముందుగానే బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క సారి పేర్లు బయటికి వస్తే తమపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు అంటున్నారు. మొత్తం మీద నామినేటెడ్ పోస్టులపై టీఆర్ఎస్ నాయకులు పెట్టుకున్న ఆశలు ఎంతవరకు తీరతాయో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *