మొన్నటి వరకు తమిళనాడు రాజకీయాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చుట్టూతా తిరిగితే ఇప్పుడు మాత్రం జయలలిత ఆత్మ చుట్టూ తిరుగుతున్నాయి. తాను జయలలితకు పూర్తి విధేయంగా ఉన్నానని తనను నియమించింది పురచ్చితలైవి అమ్మెనని చెప్తున్న పన్నీరు సెల్వం తనను అమ్మ ఆత్మే నడిపిస్తోందని ప్రకటించారు. అమ్మ ఆత్మ ఇస్తున్న సూచనల మేరకే తాను నడుటుకుంటున్నానంటూ చెప్పాడు. అమ్మ ఆత్మే తనతో అన్ని పనులు చేయిస్తోందంటూ చెప్పిన పన్నీరు సెల్వం చిన్నమ్మపై తిరుగుబాటుకు ముందు అమ్మ సమాధి వద్ద మౌనంగా కొద్ది సేపు ధ్యానం చేశాడు. అక్కడి నుండి బయటికి వచ్చిన తరువాత తనను బలవంతంగా ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించారంటూ మీడియా ముందు వాపోయాడు. అమ్మ తనను నియమించినందున తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పాడు.
ఇటు జయలలిత నెచ్చెలి శశికళ కూడా అమ్మ ఆత్మ తమకు వెన్నంటి ఉందని చెప్పుకుంటున్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అమ్మ సమాధి ముందు పెట్టిన తరువాతే గవర్నర్ ను కలిశారు. అటు తర్వాత సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించిన తరువాత బెంగళూరు కోర్టులో లొంగిపోవడానికి వెళ్తున్న ముందు కూడా శశికళ జయలలిత సమాధి వద్ద గట్టిమా మాట్లాడుతూ కనిపించారు. సమాధిని గట్టిగా తడుతూ మాట్లాడుతూ వింతగా ప్రవర్తించారు. గట్టిగా శపథం చేస్తున్నట్టుగా శశికళ ప్రవర్తించిన తీరు ఎవరికీ అర్థం కాలేదు.
మొత్తం మీద తమిళనాట అమ్మ ఆత్మ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎవరికి వారు అమ్మ ఆత్మ తమతోనే ఉందని చెప్తున్నారు. మరి నిజానికి అమ్మ ఆత్మ ఎవరితో మాట్లాడుతోందో మరి……