ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటుగా మరో ఇద్దరు సుధాకరన్, ఇళవరసి లను దోషులుగా సుప్రీం కోర్టు నిర్థారించిన నేపధ్యంలో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారాయి. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ఖరారు అయిన నేపధ్యంలో శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అసాధ్యం. జైలు శిక్షతో పాటుగా శశికళ పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయారు. ప్రస్తుతం శశికళ మరో వ్యక్తిని ముఖ్యమంత్రిగా తెరముందుకు తీసుకుని వస్తారా అనేది చూడాలి. ఇప్పటివరకు శశికళకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు తీర్పు అనంతరం కూడా ఆమెకు మద్దతుగా ఉంటారా లేక ప్లేట్ ఫిరాయించి పన్నీరు సెల్వానికి జై కొడతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వివిధ వర్గాల నుండి ఇప్పటికే పన్నీరు సెల్వానికి మద్దతు పెరుగుతున్న నేపధ్యంలో తాజాగా కోర్టు తీర్పు కూడా పన్నీరు సెల్వం వర్గానికి అనుకూలంగా రావడంతో సెల్వం మద్దతుదారులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. పన్నీరు సెల్వం నివాసం ముందు ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర ఇంచార్జీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు పై ఉంది. శశికళకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు గవర్నర్ శశికళ వర్గానికి చెందిన మరో వ్యక్తికి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పిస్తారా లేక పన్నీరు సెల్వంకు మద్దతు నిరూపించుకునే అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి.