అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ స్వరం పెంచారు. తాను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తీవ్ర స్వరంలో హెచ్చరించారు. పన్నీరు సెల్వం పార్టీని చీల్చడానికి కుట్రలు పన్నాడని అయితే ఆ కుట్రలు ఫలించవని విరుచుకునిపడ్డారు. గతంలో ఎంజీఆర్ మరణించిన సమయంలో అమ్మ జయలలితకు జరిగిన అవమానం తనకు జరుగుతోందని అప్పట్లో కూడా పార్టీని చీల్చడానికి కుట్రలు జరిగినా అమ్మ వాటిని తట్టుకుని నిలబడ్డదరని ఆమె స్పూర్తితో తాను కూడా కుట్రలను అధిగమిస్తామనని శశికళ వ్యాఖ్యానించారు. పన్నీరు సెల్వంకు డీఎంకేతో పాటుగా బీజేపీ కూడా మద్దతు ఇస్తోందని శశికళ ఆరోపించారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని శశికళ మండిపడ్డారు. రాజ్యంగా బద్దంగా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడానికి తనకు అవకాశం ఉన్నా తనకు అవకాశం కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తనకు అనుకూలంగా 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అయినా తనకు అవకాశం కల్పించకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని శశికళ విమర్శించారు. డీఎంకే తో కలిసిపోయిన పన్నీరు సెల్వం పార్టీని చీల్చే కుట్రులు పన్నుతున్నారని అన్నారు.
తనకు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ శశికళ కోర్టుకు ఎక్కుతున్నారు. తనకు అధికశాతం ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ తనను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించకపోవడాన్ని ఆమె వర్గం ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు వేచిచూసే ధోరణితో ఉన్న శశికళ వర్గం ఇక కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. శశికళ భర్త నటరాజన్ ఢిల్లీలో మకాం వేశారు.
తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకీ మలుపులు తిరుగుతుండడంపై డీఎంకే వర్గాలు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. పార్టీ నాయకులు చెన్నైలో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు.