పన్నీరుకు బీజేపీ ఎందుకు మద్దతిస్తోంది

     ప్రస్తుతం పార్లమెంటులో మూడో అతిపెద్ద పార్టీ అన్నాడీఎంకే. బీజేపీ, కాంగ్రెస్ ల తరువాత ఎక్కువ మంది ఎంపీలు ఈ పార్టీలకు చెందిన వారే ఉన్నారు. ప్రస్తుతం లోక్ సభ, రాజ్యసభలో కలుపుకుని ఈ పార్టీకి 50 మంది సభ్యులు ఉన్నారు. పార్టీ శశికళ, పన్నీరు సెల్వం వర్గాలుగా నిట్టనిలువునా చీలిపోయిన తరువాత ఎక్కువ మంది పార్లమెంటు సభ్యుల మద్దతు పన్నీరు సెల్వం కే ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీలోని కీలక సభ్యులు సుందరం, అశోక్ కుమార్ లు ఇప్పటికే పన్నీరు సెల్వంను కలిసి మద్దతు ప్రకటించారు. లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న తంబిదురై శశికళ వర్గంలో ఉంటూ ఆమెకు మద్దతు పలుకుతుండగా ఇతరులంతా పన్నీరు వైపే ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.  50 మంది సభ్యుల మద్దతు ఉండడం వల్లే బీజేపీ కూడా పన్నీరు సెల్వాం వైపే మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. 50 మంది సభ్యుల మద్దతు అంటే అంత ఆషామాషీ కాదన్న సంగతి తెలిసిన బీజేపీ పన్నీరుకు మద్దతుగా నిలుస్తోంది. త్వరలో రానున్న రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఎంపీల మద్దతును పొందడంద్వారా కేంద్రానికి దగ్గర అయిన పన్నీరు సెల్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తన రాజకీయ అనుభవంతో పార్టీలో పెద్దల పట్ల విధేయత చూపుతూ వారిని తనవైపు తిప్పుకుంటున్నాడు. అన్నా డీఎంకేలో కీలక నేతల మద్దతును సంపాదించుకుంటున్న పన్నీరు సెల్వం శశికళకు అన్నిరకాలుగా చెక్ పెడుతున్నారు. ఎంపీల మద్దతు సంపాదించిన పన్నీరు సెల్వం జయ మరణంపై తమకు అనుమానాలు ఉన్నట్టు మరోసారి చెప్పించడం ద్వారా జాతీయ స్థాయిలో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత చేకూరేలాగా చేస్తున్నారు. జయ మరణంపై సీబీఐ విచారణకు ఈ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. జయలలితది సహజ మరణం కాదని ఆమె మరణానికి సంబంధించిన నిజానిజాలు వెల్లడికావాల్సిందేనని ఎంపీలు అంటున్నారు. శశికళ కనీసం జయ చికిత్స సమయంలో ఆస్పత్రిలోకి రాకుండా అడ్డుకున్నారని మండిపడుతున్నారు. అమ్మ పేరుచెప్పుకుని శశికళ అరచాలు సాగిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *