తగ్గేది లేదంటున్న ట్రంప్

ముస్లీంల మెజారిటీ ఉన్న ఏడు దేశాలకు చెందిన వారిని అమెరికాలోకి శరణార్థులుగా, వలసలుగా రాకుండా అడ్డుకుంటూ తీసుకున్న నిర్ణయాన్ని  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయం పట్ల స్వదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా ట్రంప్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయం పై వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లలో చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. ట్రంప్ నిర్ణయం తీసుకున్న  నాటి నుండి నేటి వరకు నిరసన ప్రదర్శనలు ఆగడం లేదు. ట్రంప్ దేశాన్ని మత ప్రాతిపదికన విడదీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని నిరసన కారులు అంటున్నారు. వలస వాదంపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు చాలా దారుణంగా ఉన్నాయని వారు మండిపడుతున్నారు. సిలికాన్ వ్యాలీలోని బడా సాఫ్టవేర్ సంస్థల నుండి సామాన్యుల వరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా అమెరికా అధ్యక్షుడు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.
మెక్సికో నుండి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అంటూ రెండు దేశాల మధ్య గోడ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్ ముస్లీంలు దేశంలోకి ప్రవేశించడం పై ఆంక్షలు విధించారు. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలతో పాటుగా పలు సాఫ్టవేర్ కంపెనీల సీఇఓలు ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా వాటిని పట్టించుకునే అవకాశమే లేదంటున్నారు ట్రంప్. తనకు అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమని దాని కోసం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా వెనక్కితగ్గే ప్రసక్తిలేదంటున్నారాయన.
జాతీయవాదిగా, మతతత్వవాదిగా ఎవరే ముద్రవేసినా సరేనంటున్న ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమల్లో పెట్టేందుకే సిద్ధం అవుతున్నారు. మరోవైపు విమర్శలు ఎలా ఉన్నా ట్రంప్ కు మద్దతు పలుకుతున్న వారు కూడా లేకపోలేదు. అమెరికన్ల ప్రయోజనాలకోసం పనిచేస్తున్న ట్రంప్ కు మద్దతు పలకాల్సిన సమయం వచ్చిందంటూ పెద్ద ఎత్తున ఆయన మద్దతు దారులు ప్రచారం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్ నిర్ణయాల వల్ల దేశ ప్రయోజనాలకు భంగం కలగడంతో పాటు అమెరికా ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పడుతున్నాయని ఓబామా విమర్శించారు.
వలస విధానం పై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ సహా పలు దేశాలను వణికిస్తున్నాయి. హెచ్-1బి వీసాల విషయంలో అమెరికా అనుసరించబోయే విధానాలపై ఇప్పటికే భారతీయ సాఫ్టవేర్ కంపెనీలు బెంగపెట్టుకున్నాయి. ట్రంప్ కోరుకున్న విధంగా నిబంధనల్లో మార్పులు తీసుకుని వస్తే భారతీయ కంపెనీలకు భారీ నష్టం తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *