కిడ్నాపర్ల చెరనుండి బయటపడ్డ చిన్నారి

 
తిరుమలలో కిడ్నాప్ కు గురైన చిన్నారి అచూకీ లభించింది. సంచలనం రేపిన ఈ ఘటనలో కిడ్నాపర్ల చెరనుండి ఐదు సంవత్సరాల చిన్నారి నవ్యశ్రీ క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో కిడ్నాప్ కు గురైన ఆ చిన్నారిని మహబూబ్ నగర్ జిల్లాలో కనుగొన్నారు. పోలీసుల కథనం ప్రకారం తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ఆదివారం 5 సంవత్సరాల చిన్నారి నవ్యశ్రీ ని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్ ఘటన తిరుమలలో కలకలం సృష్టించింది.  అనంతపురం జిల్లా  కనగానపల్లి మండలంలోని తూముచెర్లకు చెందిన ఈ చిన్నారి కిడ్నాప్ వ్యవహారం టీవీల్లో ప్రముఖంగా ప్రసారం అయింది.
సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుండి కల్వకుర్తి వెళ్తున్న బస్సులో చిన్నారిని గుర్తించిన ప్రయాణికులు చిన్నారితో మాటలు కలిపితే తమది అనంతపురం జిల్లాగా చెప్పింది. దీనితో పాపాతో ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తే సంబంధంలేని జవాబులు చెప్తుండడంతో ప్రయాణికులకు అనుమానం కలిగి గట్టిగా ప్రశ్నించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు పిల్లలు లేకపోవడంతో తాను తిరుమలలో ఈ చిన్నారిని అపహరించినట్టు నిందితుడు అంగీకరించాడు. దీనితో కిడ్నాపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుల చొరవతోనే చిన్నారి తల్లిదండ్రులను చేరుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *