హోదా కోసం రాజీనామాకు సిద్ధం:జగన్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పై మరోసారి వివాదం రాజుకుంది. పార్లమెంటులో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేకుంటే రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులంతా రాజీనామాలకు సిద్దపడాలని విపక్షనేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని జగన్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు ఢిల్లీ నేతలతో జగడానికి అయినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రానికి చెందిన నేతలంతా ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాను సాధించుకుందామని దానికి అవసరం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకత్వంలో ఢిల్లీకి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ సంవత్సరం మే లోపల ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జగన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్ సభ సభ్యులంతా తమతమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. తమ పార్టీకి చెందిన సభ్యులు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని అధికార పక్ష సభ్యులు తమ అభిప్రాయాన్ని చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నోరుమెదపకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారని జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువునా ముంచిందని అయినా చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రయోజనాలకన్నా తెలుగుదేశం పార్టీకి పదవులు ముఖ్యంగా మారాయని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ మంత్రి పదవులను వదులుకోలేరా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాచేసి ఉధ్యమిస్తే తప్పకుండా ప్రత్యేక హోదాను సాధించుకోవడం ఖాయమని అన్నారు. విశాఖలో ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు నిర్వహిస్తున్న కార్యక్రమానికి తాను హాజరు అవుతానని జగన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *