ఆ నిర్ణయం తీసుకోవద్దు-చాగంటికి అభిమానుల వినతి

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలను ఆపేస్తారని వస్తున్న వార్తల పట్ల ఆయన అభిమానులు, శిష్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చాగంటి చేసిన ప్రవచనంలో కృష్ణుడిని గురించి చెప్తున్న క్రమంలో చాగంటి యాదవుల మనోభావాలను దెబ్బతీసేలాగా వ్యాఖ్యానించారంటూ యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా పలు చోట్ల పోలీసు కేసులను నమోదు చేశాయి. దీనిపై తీవ్రంగా మనస్థాపం చెందిన చాగంటి కోటేశ్వరరావు తాను ఇక నుండి ప్రవచనాలకు దూరంగా ఉంటానంటూ సన్నిహితుల వద్ద అన్నట్టు సమాచారం. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అవమానపర్చలేదని తాను బహిరంగంగా ఎవరినైనా నొప్పిస్తే క్షమాపణలు చెప్తున్నట్టు ప్రకటనలు చేసిన తరువాత కూడా పరిస్థితి సర్ధుమణగకపోవడంతో చాగంటి తీవ్ర మనస్థాపంతో ప్రవచనాలకు దూరం కావాలని యోచిస్తున్నట్టు సమాచారం రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పురాణాలు, ఇతిహాసాలను గురించి చెప్పేవారు కరువైన నేపధ్యంలో చాగంటి లాంటి వారు ప్రవచనాలకు దూరం కావడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రవచనాలకు దూరంగా ఉండాలనే చాగంటి నిర్ణయించుకున్నట్టు వస్తున్న వార్తలు తమని తీవ్రంగా కలచివేస్తోందని వారు అంటున్నారు. చాగంటి అటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవద్దని వేడుకుంటూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనను కోరుతున్నారు. చాగంటి అందుబాటులో లేకపోవడంతో ఆయన నివాసానికి ఉత్తరాలు రాయడం ద్వారా, సందేశాలు పంపడం ద్వారా చాగంటికి మద్దతుగా నిలుస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది ప్రవచనాలకు దూరం కావద్దని కోరుతున్నారు. చాగంటి తన ప్రవచనాల ద్వారా ఆద్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం మన పురాణాలు, ఇతిహాసలపై ప్రతీ ఒక్కరిలోనూ ఆశక్తి కలిగంచే విధంగా ప్రవచనాలు చెప్తున్న చాగంటి తన ప్రసంగాల ద్వారా హిందూ సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారని వారంటున్నారు.
చాగంటి పై వివాదాలు ముసురుకోవడం ఇదే మొదటిసారి కాదు గతంలోనూ ఆయన్ను వివాదాలు చుట్టుముట్టాయి. చాగంటి కోటేశ్వరరావు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన నేపధ్యంలో ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేయాలని యాదవ సంఘాలకు కూడా చాగంటి అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. చాగంటి తన ప్రసంగంలో భాగంగా చెప్పిన మాటలు ఉద్దేశపూర్వకంగా ఎవరినీ అవహేళన చేయడానికి కాదని అయినా ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పిన తరువాత కూడా అనసరంగా వివాదాన్ని పెద్దది చేయడం సమంజసం కాదని వారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *