భారత సైన్యం ధూకుడు

సరిహద్దుల్లో తెంపరితనాన్ని ప్రదర్శిస్తున్న పాకిస్థాన్ కు గట్టి బుద్ది చెప్పాలని భారత్ భావిస్తోంది. గతంలో మాదిరిగా వేచి చూసే ధోరణితో కాకుండా పాకిస్థాన్ కు గట్టిగానే సమాధానం చెప్పడానికి భారత బలగాలు సిద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ భూబాగంలోకి చొచ్చుకుని పోయి సర్జికల్ దాడులు నిర్వహించిన తరువాత భారత వైఖరిలో భారీ మార్పు వచ్చిందని విదేశాంగ నిపుణులు చెప్తున్నారు. నిత్యం సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు గట్టిగానే జవాబు చెప్తున్నారు. పాక్ కాల్పులకు దిగిన వెంటనే భారత బలగాలు పెద్ద ఎత్తున ఎదురు కాల్పులకు దిగుతున్నాయి. తేలికపాటి ఆయుధాలతో పాటుగా అవసరం అయితే మోర్టార్లతోనూ భారత్ కాల్పులు జరుపుతోంది. అయితే పాకిస్థాన్ తరహాలో జనావాసాలను లక్షంగా చేసుకుని కాల్పులకు తెగబడకుండా పాకిస్థానీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని భారత్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి.
ఇటు సరిహద్దుల్లోనూ… అటు అంతర్జాతీయ వేదికలపైనా పాకిస్థాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాశ్మీర్ వ్యవహారంలో గతంలో కొంత మెతక వైఖరి అవలంబించిన పాకిస్థాన్ ఇప్పుడు దుకుడును పెంచింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన అంటూ ప్రచారం చేయడంతో పాటుగా ఉగ్రవాద నేతలను నెత్తిన ఎక్కించుకుని వారిని పోరాట యోధులుగా చిత్రీకరిస్తోంది. ఈ పరిణామాల పట్ల భారత్ తీవ్రంగానే స్పందిస్తోంది. చైనా మద్దతుతో పాకిస్థాన్ ప్రదర్శిస్తున్న దూకుడుకు కళ్లెం వేయాలనే దిశగా వెళ్తున్న భారత్ సరిహద్దుల్లో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులకు తీవ్రంగా భారత బలగాలు స్పందిస్తున్నాయి. ఇకపై ఉపేక్షించే ధోరణిని విడిచిపెట్టి దెబ్బకు దెబ్బ తీయాలనే లక్షంతోనే భారత్ పాకిస్థాన్ కు జవాబు చెప్తోంది.
భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ జమ్మూ-కాశ్మీర్ లో పర్యటిస్తున్నరు. కీలమైన అఖ్నోర్,రాజౌరీల్లో పర్యటించిన బిపిన్ పాకిస్థాన్ బలగాలు కాల్పులకు దిగితే గట్టిగానే సమాధానం చెప్పాలని సైనికులను ఆదేశించారు. ప్రస్తుతం దూకుడుగానే భారత సైన్యం వ్యవహరిస్తుండగా అవసరం అయితే మరింత దూకుడును పెంచాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. దీని ద్వారా భారత్ చేతులు కట్టుకుని కూర్చోదనే స్పష్టమైన సంకేతాలు వెళ్లేలాగా భారత సైన్యం వ్యవహరించబోతోంది. శ్రీనగర్ తో పాటుగా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన యుద్ధ క్షేత్రంగా చెప్పుకునే సియాచిన్ లోనూ రావత్ పర్యటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *