ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. లక్నో లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన సభకు వచ్చిన జనసమూహం ఆ పార్టీకి నూతన ఉత్తేజాన్ని తీసుకుని వచ్చింది. ప్రధాని సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీజేపీ కార్యకర్తలతో పాటుగా పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజానీకం ప్రధాని సభకు రావడంతో పాటుగా ప్రధాని ప్రసంగాన్ని శ్రద్దగా విన్నారు. ప్రధాని ప్రసంగానికి సభికుల నుండి వచ్చిన స్పందన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రధాని సభకు సంప్రదాయ బీజేపీ వాదులతో పాటుగా ఇత వర్గాలకు చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పెద్ద సంఖ్యలో హాజరైన సభికులను చూసి మోడీ కూడా ఉత్సాహంగా కనిపించారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన జనసమూహాన్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది రానున్న ఎన్నికల్లో గాలి ఎటువైపు వీస్తుందో అన్న సంగతి అంటూ మోడీ బీజేపీ శ్రేణులను ఉత్సాహపర్చారు. ఉత్తర్ ప్రదేశ్ లోని వైరి పక్షాలపై ఆయన తనదైన శైలిలో విరుచుకుని పడ్డారు. అధికార సమాజ్ వాదీ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో మునిపోయిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకునే తీరిక అధికార పక్షానికి లేకుండా పోయిందని సమాజ్ వాదీ పార్టీ పాలనలో రాష్ట్రం అన్నిరకాలుగా వెనుకబడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాజకుమారిడికి పగ్గాలు అప్పగించాలనే తాపత్రయం తప్పిస్తే ఇతర విషయాలను గురించి పట్టింకోవడం మానేసిందన్నారు. నల్లధనాన్ని దాచుకోవడం పై ఉన్న శ్రద్ద బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి మరొకదానిపై లేదన్నారు. నల్లధనాన్ని మార్చుకోవడంలో బీఎస్పీ మునిగిపోయిందన్నారు.
అవినీతి, బంధుప్రీతిలో మునిగిపోయిన పక్షాలను తరిమికొట్టాలని మోడీ పిలుపునిచ్చారు. కులాన్ని పక్కన పెట్టి అభివృద్ది కోసం ఓటువేయాలని మోడీ కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా పేదలకోసం తాను పాటుపడతానని వారి అభ్యున్నతి కోసం చేయాల్సిందందా చేస్తానన్నారు. అవినీతిని దేశం నుండి తరిమివేయాలనే కంకణం కట్టుకున్న తనను ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. అంతిమంగా ప్రజలకే తాను జవాబుదారిగా ఉంటానని దేశంలో అవినీతిపై జరుగుతున్న యుద్ధానికి ప్రజలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారని వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని అన్నారు.