యూపీలో బీజేపీ పాగా వేస్తుందా?

పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ఉత్తర్ ప్రదేశ్ లో తండ్రి కొడుకుల మధ్య ముద్ధం ఇతర పార్టీలకు లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ములాయం తనయుడి అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ములాయం ప్రకటించిన నేపధ్యంలో సమాజ్ వాదీ పార్టీలో రాజకీయ ములసం పుట్టింది. తమదే అసలైన సమాజ్ వాదీ పార్టీ అని అఖిలేష్ వర్గం వాదిస్తుంటే వారికి అంత సీన్ లేదని మాలాయం వర్గీయులు అంటున్నారు. ఎన్నికలకు పట్టుమని ముడునెలలైనా లేని ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ్ వాదీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు విపక్షాలకు అనుకోని వరంగా మారాయి. ముఖ్యంగా యూపీలో పాగా వేయాలని కాచుకుని కూర్చున్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేత మాయవతికి, బీజేపీ కి ఈ తండ్రికొడుకుల యుద్ధం అనుకోని వరంగా మారింది.
గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లకు గాను 71 సీట్లను గెల్చుకున్న బీజేపీ యూపీలో పాగా వేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మోడీ ఛరిష్మా ముందు సమజ్ వాదీ పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకోసుకుని రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని పొందే దిశగా బీజేపీ కసరత్తు చేసింది. అయితే లోక్ సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు తేడా కనిపిస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం అంత సులభం కాదని బీజేపీ కూడా అంగీకరించే స్థితికి చేరుకున్న తరుణంలో వారికి అనుకోని వరంగా తండ్రీ కొడుకుల యుద్ధం కలిసి వస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లో తిరిగి అధికారాన్ని చేపట్టాలని ఉవ్వీళురుతున్న మరో పార్టీ బీఎస్పీ రాష్ట్రంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించిన ఆ పార్టీ అధినేత్రి మాయావతి అవినీతి ఆరోపణలతో గద్దె దిగాల్సి వచ్చింది. విపరీతమైన అవినీతి, అధికార కేంద్రీకరణ వంటి ఆరోపణలతో బీఎస్పీ దారుణంగా దెబ్బతినింది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్న మాయవతి కి అధికార పక్షంలోని ఇంటిపోరు లాభించేట్టుగా ఉంది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీలు, నాయకుల కన్నా కులాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడి ఎన్నికలంటే కులాల  కుమ్ములాటలే. ఒక్కో పార్టీ ఒక్కో కులాన్ని నెత్తిన పెట్టుకుని పోషిస్తుంది. కులాల వారీగా ఓట్లు పడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రబలంగా ఉన్న ఓబీసీలు ఎన్నికల్లో ప్రధాన భూమికను పోషిస్తున్నారు. వీరి మద్దతు సాధించడం ద్వారా సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు కూడా ఓబీసీలు సమాజ్ వాదీ పార్టీ పక్షాన్నే ఉన్నట్టు కనిపిస్తున్నా తండ్రీ కొడుకుల మధ్య ఓట్లు చీలిపోతే ఆ మేరకు ఇతర పార్టీలు లాభపడతాయి. ఇక రాష్ట్రంలో ఉన్న 15 శాతం మంది ముస్లీం ఓటర్ల మద్దతు ములాయంకే. బీజేపీని వ్యతిరేకించే ఈ ఓటర్లు గతంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా ఇప్పటి పరిస్థితుల్లో వారి ఖచ్చితంగా ములాయం వెంట వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే సంఖ్యలో ఉన్న దళితుల ఓటు బ్యాంకును బీఎస్పీ కల్లగొట్టడం ఖాయం. వీరితో పాటుగా దాదాపు 15 శాతం ఉన్న అగ్రవర్ణాల ఓట్లను కూడా సొతం చేసుకుని బీఎస్పీ గతంలో యూపీలో పాగా వేయగలిగింది. దళిత, అగ్రవర్ణాల ఐక్యత అంటూ కొత్త సిద్ధాతం ద్వారా బీఎస్పీ ఎన్నికల్లో సత్తా చాటింది. అయితే ప్రస్తుతం అగ్రవర్ణాల మద్దతు బీజేపీకే లభించే అవకాశాలు ఉన్నాయి. ఇటు అగ్రవర్ణాల ఓట్లతో పాటుగా ఓబీసీల్లోని బలమైన వర్గాల మద్దతు కూడగట్టడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఓబీస ఓట్లు చీలితే ఈ మేరకు బీజేపీ అధికారానికి దగ్గర అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. యూపీలో తాము చక్రం తిప్పుతామనే ఆశ కూడా ఆ పార్టీకి లేనట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇక్కడ తోక పార్టీగానే మిగిలిపోయిన కాంగ్రెస్ వచ్చిన సీట్లతో సర్థుకునే ప్రయత్నాలు చేస్తోంది. తండ్రి కొడుకుల మధ్య వైరం విపక్షాలకు ఎంత మేరకు లాభిస్తుందో ఎవరెని గద్దెపై కూర్చో బెడుతుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *