నేతలతో నయీంకు లింకుల్లేవంటున్న పోలీసులు

 కరడుగట్టిన నేరగాడు నయూంకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయన్న వాదనలు సరికాదని దీనికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు లేవని,     నయీంకు అంతర్జాతీయ నేరగాడు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని తెలంగాణ హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ హైకోర్టుకు స్పష్టం చేసింది. నయీం కేసులో చాలా విషయాలు వెలుగులోకి రాకుండా పోతున్నాయంటూ సీపీఐ నేత నారాయణ దాఖలు చేసిన పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర హోం శాఖ నయీం కేసులు సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లోని నక్సలైట్లతో పాటుగా దావుద్ ముఠాతో నయీంకు సంబంధాలు ఉన్నట్టు తమ విచారణలో వెల్లడికాలేదని తెలిపింది. నయీం కేసును ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు చేస్తోందని 175 కేసులకు గాను 16 ఛార్జీషీట్ లను దాఖలు చేసినట్టు కోర్టుకు వివరించింది. 10 పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నట్టు హోంశాఖ వివరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించిన పోలీసు అధికారుల్లో విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఏసీపీ సీతారాం, సీఐలు బి.కిషన్‌, పి.శ్రీనివాస్‌ నాయుడు, నరేందర్‌గౌడ్‌, బల్వంతయ్య, మహ్మద్‌ మజీద్‌, కె.వెంకట్‌రెడ్డి, రవికిరణ్‌రెడ్డి, ఇ.రవీందర్‌, శ్రీనివాస్‌లు ఉన్నట్టు తెలిపింది. వీరితో పాటుగా ఎల్బీనగర్  ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను కూడా విచారించినట్టు హోంశాఖ తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసమే నారాయణ హైకోర్టును ఆశ్రయించారని కేసు విచారణలో సిట్ పడ్బందీగా వ్యవహరిస్తోందని సమగ్ర విచారణ జరుపుతోందని కోర్టుకు వివరించింది. కొంత మంది పోలీసులను సిట్ కాపాడుతోందనే వాదన సరికాదని పేర్కొంది. నయీం ద్వారా పోలీసులు లబ్ది పొందారనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *