రాహుల్ మాట్లాడేశారు ఇక భూకంపం రాదు:మోడీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రధాన మంత్రి మోడీ చెణుకులు విసిరారు. రాహుల్ గాంధీ మాట్లాడితే ఎక్కడ భూకంపం వస్తుందోనని ప్రజలు భయపడ్డారని ఆయన ఇప్పుడు మాట్లాడేశారు కనుక భూకంపం వచ్చే అవకాశం లేదని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని కన్పూర్ లో మాట్లాడిన మోడీ రాహుల్ పై చలోక్తులు విసిరారు. పార్లమెంటులో తనకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారని తాను మాట్లాడితే భూకంపం వస్తుందని అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడేశారు కనుక ఇక నిశ్చింతగా ఉండవచ్చన్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013-14 సంవత్సరాల మధ్య తొమ్మిది సార్లు మోడికి డబ్బులు అందాయని రాహుల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. సహరా, బిల్ల సంస్థల నుండి మోడీ ముడుపులు పుచ్చుకున్నారని రాహుల్ అన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపించాలని రాహుల్ కోరిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించిన మోడీ రాహుల్ గాంధీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని విమర్శించారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని ప్రజలంతా మంచి రోజులు వస్తున్నాయని సంబరపడుతుంటే కొంత మంది మాత్రం లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని ప్రజలందరికీ తాను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నానని కష్టాలను సైతం ఓర్చుకుంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిల్చారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనాన్ని పోగుచేసుకున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. దేశ ప్రజలంతా ప్రస్తుత పరిస్థితుల్లో ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *