రక్తసంబంధీకులు లేకుండానే….

తమిళనాడులోని ప్రజలంతా నా కుటుంబ సభ్యులే అని చెప్పుకునే జయలలిత సొంత కుటుంబానికి మాత్రం దూరంగానే ఉంటూ వచ్చారు. అవివాహితురాలిగానే మిగిలిపోయిన జయలలిత బంధువులను కూడా పెద్దగా దగ్గరికి రానిచ్చిన దాఖలాలు లేవు. జయలలితకు ఒక అన్నా, ఒక చెల్లి ఉన్నారు. అన్న చనిపోగా చెల్లెలి కుటుంబం బెంగళూరులో ఉంటోంది. అన్న కూతురు చెన్నైలోనే ఉన్నా ఇరు కుటుంబాల మధ్య పెద్దగా రాకపోకలు లేవు. జయలలిత ఆనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు జయ అన్న పిల్లలను కానీ చెల్లెలి పిల్లలను కానీ ఆసుపత్రి లోపలికి అనుమతించలేదు. కేవలం శశికళ మాత్రమే జయలలిత వెంట ఉన్నారు. జయలలిత తల్లి నటి సంధ్య ,జయ తండ్రి ఆర్‌.జయకుమార్‌. ఆయన తండ్రి మైసూర్‌ నల్వాడి కృష్ణరాజ వడియార్‌ సంస్థానంలో వైద్యులు. జయ తండ్రి జయరామన్‌కు ఇద్దరు భార్యలు జయమ్మ, సంధ్య. జయమ్మకు వాసుదేవన్‌ అనే కుమారుడున్నారు. జయ తల్లికి జయకుమార్‌, జయలలిత, శైలజ సంతానం. జయకుమార్‌ 1995లో మరణించారు. ఆయన కుమార్తె దీపా జయకుమార్‌ టీనగర్లో నివసిస్తోంది. శైలజ కూడా బెంగళూరులో ఉంటోంది. జయకుమార్‌ మరణించినప్పుడు వాళ్ల ఇంటికెళ్లి ఆయన అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. అయితే జయలలిత కొంతకాలంగా ఈ కుటుంబ సభ్యులకు పూర్తిగా దూరమయ్యారు.  ఆమె తన తోబుట్టువులు, వారి కుటుంబాలకు దూరమైపోయారు. చివరకు జయ ఆరోగ్య పరిస్థితి సైతం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసే పరిస్థితులు లేనంతగా మారిపోయాయి. జయలలిత అన్న కూతురు దీపా జయకుమార్‌ అపోలో ఆసుపత్రి వద్దకు పలుమార్లు వచ్చినా లోనికి అనుమతించలేదు.   జయలలిత పినతల్లి కుమారుడు వాసుదేవన్‌ కూడా జయలలితను చూడలేకపోయారు. జయ చివరి ఘడియల్లో రక్త సంబంధీకులు ఎవరూ అమె వద్ద లేకుండా పోయారు. శశికళ అమె బంధుగణం మాత్రమే జయ వెంట తుదివరకు ఉన్నారు.