ఎవరినీ వదిలిపెట్టం:కేటీఆర్

నానక్ రాం గూడ ఘటన అత్యంత బాధాకరమని మున్సిపల్ శాఖా మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రస్తుతం కూలిపోయిన భవనం ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని ఆయన వెల్లడించారు. భవనం కూలిన ప్రాంతానికి వచ్చిన కేటీఆర్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించి ఇంతమంది మృతికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదని కేటీఆర్ తెలిపారు.
     మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను, ఏసీపీని తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించామని అన్నారు. అక్రమ నిర్మాణాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అయినా ఇటువంటి సంఘటనలు జరగడం బాధ కలిగిస్తోందని చెప్పారు. చిన్న చిన్న స్థలాల్లో భారీ భవనాలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిల్డర్ వెనుక ఒక మంత్రి ఉన్నట్టు వస్తున్న వార్తలపై కూడా కేటీఆర్ స్పందించారు. మంత్రి కుటుంబ సభ్యులు తప్పు చేసినా వదిలేది లేదని ఎవరినీ ఉపేక్షించబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.
    అక్రమనిర్మాణాల విషయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా కొంత ఉదాశీనంగా ఉంటున్నారని నిర్లక్ష్యంతో వ్యవహరించే సిబ్బంది పై కూడా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. బిల్డర్ ను త్వరలోనే పోలీసులు పట్టుకుంటారని ఎంతటివారైనా చట్ట నుండి తప్పించుకోలేరని కేటీఆర్ అన్నారు.